బాసరలో సత్యనారాయణస్వామి పూజలు
బాసర: కార్తీకమాసం సందర్భంగా బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆలయ వైదిక బృందం ఆధ్వర్యంలో సత్యనారాయణస్వామి పూజలు నిర్వహిస్తామని ఈవో అంజనాదేవి తెలిపారు. గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీసూర్యేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలతోపాటు గోదావరి నదికి సాయంత్రం 6:30 గంటలకు కార్తీక దీపారాధన పూజలు చేస్తామని పేర్కొన్నారు. పూజా కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలు హాజరు కావాలని కోరారు.
ఆలయానికి మంగళవాయిద్యాలు..
బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయానికి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన భక్తులు శనగశెట్టి జగదీశ్ – బొబ్బిలి ప్రసాద్ కుటుంబ సభ్యులు మంగళవాయిద్యాలను అందించారు. అమ్మవారికి అభిషేకం సమయంలో వినియోగించేలా ఒక డోలు, రెండు సన్నాయిలను విరాళంగా అందజేశారు. వీటి విలువ రూ.44,200 ఉంటుందని ఆలయ అనువంశిక ట్రస్ట్ సభ్యుడు శరత్ పాఠక్ తెలిపారు. వీరివెంట ఆలయ సూపరింటెండెంట్ లక్ష్మణ్, సన్నాయి డోలు సిబ్బంది ఉన్నారు.


