
పేదల గూడు.. ‘ఉపాధి’ తోడు
ఇందిరమ్మ ఇళ్లు.. ఈజీఎస్‌తో అనుసంధానం కూలీల కొరత నివారణకు ప్రభుత్వ వ్యూహం 90 రోజుల పనిదినాలు కల్పించేలా చర్యలు నిర్మాణాలు వేగవంతమయ్యేలా కసరత్తు
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగం పెంచే దిశగా చర్యలు ప్రారంభించింది. నిర్మాణంలో ఎదురవుతున్న కూలీల కొరతను నివారించి పనులు నిరంతరంగా సాగేందుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. గ్రామీణస్థాయిలో అమలు కూడా ప్రారంభమైందని సమాచారం.
లబ్ధిదారులకు ‘ఉపాధి’..
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టే వారిలో జాబ్‌కార్డు కలిగిన లబ్ధిదారులకు నేరుగా 90 రోజుల పనిదినాలు కల్పించనుంది. ఈ విధానంతో ఇంటి నిర్మాణానికి కూలీలు అందుబాటులో ఉండడం మాత్రమే కాకుండా, లబ్ధిదారుడే తన ఇంటి నిర్మాణంలో భాగస్వామిగా మారి డబ్బులు సంపాదించుకునే అవకాశం పొందుతాడు. ఇంటి నిర్మాణ పనిని దశలవారీగా విభజించి, మొత్తం 90 రోజుల ఉపాధిని కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బేస్మెంట్ స్థాయిలో 40 రోజుల పనిదినాలు, స్లాబ్ లెవల్ వరకు 50 రోజుల పనిదినాలు కల్పిస్తారు. మొత్తం 90 పనిదినాలకు రూ.27,630 చెల్లిస్తారు.
జిల్లాస్థాయిలో పురోగతి
ప్రస్తుతం జిల్లాలోని అన్ని మండలాల్లో 131 ఇళ్లను ఉపాధిహామీ పథకం కింద గుర్తించారు.
ఇందులో గోడలస్థాయి వరకు 92 ఇళ్లు, స్లాబ్ దశకు చేరుకున్న 39 ఇళ్లు నిర్మాణ పనులను పూర్తి చేశాయి. ఈ ఇళ్ల లబ్ధిదారులు ఈజీఎస్ పనులకు వెళ్లకుండా, స్వగృహ నిర్మాణ ప్రాంతంలోనే రోజువారీ మస్టర్ వేసి కూలీ పొందవచ్చు. ఈ విధానంతో నిర్మాణ వేగం పెరగడంతోపాటు, కార్మిక శక్తి సమర్థంగా వినియోగించబడుతోంది.
రెండు విధాలా ప్రయోజనం..
ఈ కొత్త సమీకరణ ప్రజల జీవితాల్లో రెండు విధాలుగా మార్పు తీసుకురానుంది. ఉపాధి అవకాశాలు పెరగడంతో నిరుద్యోగ కార్మికులకు స్థిరమైన పని లభిస్తుంది. ఇదే సమయంలో ఇళ్ల నిర్మాణ వేగవంతం అవుతుంది. పథకాల అమలులో ఆలస్యం తగ్గి వేగంగా పూర్తవుతాయి.
మండలాలవారీగా ఉపాధి హామీ
పథకానికి అర్హులు
మండలం స్లాబ్‌లెవెల్ గోడలవరకు మొత్తం
బాసర 0 5 5
భైంసా 13 11 24
దిలావర్‌పూర్ 0 4 4
కడెం 4 6 10
ఖానాపూర్ 0 6 6
కుభీర్ 3 7 10
కుంటాల 4 5 9
లోకేశ్వరం 6 6 12
మామడ 0 3 3
ముధోల్ 0 8 8
నర్సాపూర్(జి) 3 8 11
నిర్మల్ రూరల్ 2 5 7
సారంగాపూర్ 0 1 1
సోన్ 2 4 6
తానూర్ 2 13 15
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు
మంజూరైనవి 9,165
ముగ్గు పోసినవి 5,950
బేస్మెంట్ పూర్తయినవి 3,040
గోడలు పూర్తయినవి 500
స్లాబ్ పూర్తయినవి 50
పనుల వేగవంతానికి దోహదం
ఇందిరమ్మ లబ్ధిదారుల గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించింది. అవరోధాలు అధిగమించి పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు పథకం ఉపయోగపడుతుంది. లబ్ధిదారులకు ఉపాధి కూడా లభిస్తుంది. – విజయలక్ష్మి, డీఆర్డీవో