
భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం నిర్మల్ గ్రామీణ మండలంలోని నాగ్నాయిపేటలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి భవనాలు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతను పెంపొందించేందుకు చేపట్టిన ప్రాధాన్యమైన కార్యక్రమం అన్నారు. పనుల్లో నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ప్రదేశం కేటాయించాలని, భవనం చుట్టూ హద్దుల గుర్తులు ఏర్పాటు చేయాలని సూచించారు. సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం పట్టణంలోని బంగాల్‌పేట్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ చందు జాదవ్, డీఈ తుకారాం రాథోడ్, ఏఈఈ చందన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్లు ప్రభాకర్, రాజు, ఎంపీడీవో గజానన్, హౌసింగ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహ
నిర్మాణ పనులు పరిశీలన
కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన నమూనాలో, అత్యంత నాణ్యంగా విగ్రహ రూపకల్పన జరగాలన్నారు. నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు సూర్యారావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.