
భూములపై కదలిక
సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ ఐదుశాఖలతో టాస్క్‌ఫోర్స్ కబ్జాల ఫిర్యాదులపై పరిశీలన సర్కారు భూముల చుట్టూ ట్రెంచ్ అన్నింటినీ కాపాడాలంటున్న జిల్లావాసులు
నిర్మల్: సర్కారు భూముల కబ్జాలపై అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతుండటం, వరుసగా మీడియాలో కథనాలు వస్తుండటంతో కలెక్టర్ అభిలాష అభినవ్ సీరియస్‌గా తీసుకున్నారు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్‌తో పాటు అవసరమున్నచోట పోలీసులతో పాటు సంబంధిత శాఖల సహకారంతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని పలుచోట్ల ఆక్రమణలను అధికారులు పరిశీలించారు. సర్కారు స్థలాల రక్షణకు ట్రెంచ్‌లను కొట్టిస్తున్నారు.
పరిశీలించిన అధికారులు...
జిల్లా కేంద్రంలో ఎప్పటి నుంచో భూకబ్జాలపై వస్తున్న పలు ఫిర్యాదులపై అధికారులు స్పందించారు. ఆర్డీవో రత్నకల్యాణి సహా అర్బన్ తహసీల్దార్, టౌన్‌ప్లానింగ్ అధికారి, ఇరిగేషన్ ఇంజినీర్, సర్వేయర్ ఆయా శాఖల అధికారులు, సిబ్బంది బుధవారం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. స్థానిక నిర్మల్–నిజామాబాద్ రోడ్డులో కంచెరోని చెరువు వద్ద ఆక్రమించినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు పరిశీలన చేపట్టారు. అలాగే నిర్మల్–మంచిర్యాల రోడ్డులో కలెక్టర్, ఎస్పీ క్యాంప్ కార్యాలయాల ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. హద్దుల ప్రకారం ఇక్కడ మూడువైపులా ట్రెంచ్(కందకం) కొట్టాలని నిర్ణయించారు. ఇటీవల అయ్యప్పటెంపుల్ ఎదురుగా, దివ్యగార్డెన్ పక్కన ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను తొలగించిన చోట సర్కారు భూముల బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రూ.కోట్లు పలుకుతుండటంతోనే..
నిర్మల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఎకరం భూమి రూ.కోట్లు పలుకుతోంది. మంచిర్యాలరోడ్డులో గల ఏఎన్‌రెడ్డి కాలనీ, దివ్యనగర్, దత్తాత్రేయనగర్ తదితర కాలనీల్లో ఒక్కో ప్లాటు ధర రూ.50 నుంచి రూ.60లక్షల వరకు ఉందంటే ఇక్కడి భూముల విలువ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈక్రమంలోనే ఇక్కడి సర్కారు భూములపై కొందరు బడానేతలు కన్నేశారు. అసైన్డ్ భూముల్లో వెంచర్లువేసి, ప్లాట్లు విక్రయించడమే కాకుండా పక్కనే ఉన్న ప్రభుత్వ భూములనూ కలిపేసుకోవడం, బఫర్ జోన్లలోనూ నిర్మాణాలను చేపట్టడం గమనార్హం. గతంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పెద్దగా సంబంధిత అధికారులు స్పందించలేదు. ఇందుకు వారిపై రాజకీయ ఒత్తిళ్లు ఉండటమూ కారణమే. ఇటీవల ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి స్వయంగా వెళ్లి అసైన్డ్, ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని చెప్పడంతో జిల్లా అధికారులు సీరియస్‌గానే స్పందిస్తున్నారు.
ఎక్కడా.. జాగా లేదంటూ...
‘సార్.. మా సంఘానికి రెండుగుంటల జాగా చూపియండి కదా..’ అని ఏదైన సంఘంవాళ్లు అడిగినా, ‘సార్.. రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి..’ అని విన్నవించినా.. ‘నిర్మల్లో ఎక్కడా.. సర్కారు భూమి లేదు. ఏదైనా చెరువు దగ్గరో, ఊరవతలో చూసుకుపోండి..చేద్దాం..’ అంటూ పాలకులు, అధికారులు సమాధానం చెబుతుండేవారు. డిజిటల్ లైబ్రరీ పెట్టాలన్నా, ఇండోర్ స్టేడియం కట్టాలన్నా, అంబేద్కర్, బీసీ స్టడీసర్కిళ్లను నిర్మించాలన్నా.. సెంటు భూమి లేదన్న సమాధానమే వచ్చేది. కానీ.. ఇటీవల అధికారుల పరిశీలనల్లో ఎకరాలకు ఎకరాలను కబ్జాపెట్టిన తీరు బయట పడుతోంది. అయ్యప్పటెంపుల్ వద్ద గుర్తించిన ప్రభుత్వ భూమిలో డిజిటల్ లైబ్రరీ, ఇండోర్‌స్టేడియం, ఇంకా ప్రజాపయోగ నిర్మాణాలను చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాగే.. జిల్లావ్యాప్తంగా కబ్జాల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, ప్రజాప్రయోజనాలకు కేటాయించాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు.