
‘విద్యారంగంపై చిత్తశుద్ధిలేని ప్రభుత్వం’
ఖానాపూర్: విద్యారంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. పట్టణంలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న లక్సెట్టిపేట సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ వార్డెన్ రాజ్‌గోపాల్‌ను బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు నెలలుగా రూ.8 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్య, తల్లిపై ఉన్న బంగారం సైతం అమ్మినప్పటికీ సమస్య తీరకపోవడంతో మూడు రోజుల క్రితం నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమన్నారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం కార్మికులు, ఉద్యోగులకు బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, ఖానాపూర్ అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ఉపేందర్, మనోజ్, రవీందర్ రెడ్డి, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.