
పాఠశాలలకు రేటింగ్
స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్ పథకం ద్వారా ప్రోత్సాహకాలు ఈ నెల 15 వరకు దరఖాస్తుల స్వీకరణ ఆరు అంశాల ఆధారంగా ఎంపిక
35–50 పాయింట్లు: 2–స్టార్
51–74 పాయింట్లు: 3–స్టార్
75–89 పాయింట్లు: 4–స్టార్
90–100 పాయింట్లు: 5–స్టార్
మామడ: పాఠశాలల పచ్చదనం, పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి వసతి వంటి మౌలిక సదుపాయాలపై ఆధారపడి పాఠశాలలకు రేటింగ్ కేటాయించి, మెరుగైన పాఠశాలల్ని ప్రోత్సహించాలని కేంద్రం స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్ పథకం చేపట్టింది. ఈ పథకంలో ఉత్తమ రేటింగ్ ఇవ్వడం ద్వారా స్వచ్ఛ పాఠశాలను నగదు సాయంతో ప్రోత్సహిస్తుంది.
నమోదు ప్రక్రియ
ఈనెల 15 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. జిల్లాలో 1,053 పాఠశాలలలో ఇప్పటివరకు 1008 పాఠశాలలు వివరాలు సమర్పించాయి. వీటిలో 95 శాతం మాత్రమే పాఠశాల చిత్రాలు, సమాచారాన్ని అప్‌లోడ్ చేశాయి.
ప్రోత్సాహకాలు ఇలా..
జాతీయ స్థాయిలో 200 ఉత్తమ పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ.లక్ష నదగు అందిస్తారు. గైడ్ ఉపాధ్యాయులకు మూడు రోజుల విహార యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా పాఠశాల పరిసరాలు మెరుగుపడతాయి. విద్యార్థుల కోసం ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన, పర్యావరణ అనుకూలమైన వాతావరణం కల్పిస్తారు. ఇది విద్యా నాణ్యతను మెరుగుపరచడంతో కీలకంగా మారుతుంది.
రేటింగ్ విధానం
పాఠశాలల పనితీరు 6 అంశాల మేరకు 60 ప్రశ్నలకు 125 మార్కులుగా మదింపు చేస్తారు.
1. నీటి సంరక్షణ, తాగునీటి వసతి
2. మరుగుదొడ్లు, మూత్రశాల నిర్వహణ, విద్యార్థుల చేతుల పరిశుభ్రత పాటించడం
3. పాఠశాల ఆవరణలో తోటలు, మొక్కల పెంపకం ద్వారా పచ్చదనం పెంపొందించడం
4. పాఠశాల ఆవరణలో వ్యర్థాల నిర్వహణ
5. విద్యుత్తు పొదుపు, సోలార్ వినియోగం
6. పర్యావరణ పరిరక్షణ అవగాహన
రేటింగ్ శ్రేణులు
పాఠశాలలకు వచ్చే పాయింట్ల ఆధారంగా రేటింగ్ కేటాయిస్తారు.
నమోదు చేసుకోవాలి
ఎస్‌హెచ్‌వీఆర్‌నకు సంబంధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో సూచించిన అంశాలను నమోదు చేయాలి. పాఠశాలల రేటింగ్‌ను మెరుగుపర్చుకుని రాష్ట్ర, జాతీయస్థాయికి ఎంపిక కావాలి.
– దర్శనం భోజన్న, డీఈవో

పాఠశాలలకు రేటింగ్