
‘స్థానికం’పై ఉత్కంఠ
నిర్మల్‌చైన్‌గేట్: ఏడాదిగా ‘‘ఎప్పుడో ఎన్నికలు వస్తాయి’’ అని ఎదురు చూసిన ఆశావహులకు, ఇటీవల ఎన్నికల సంఘం షెడ్యూల్, రిజర్వేషన్‌ల ప్రకటనతో ఎనలేని ఉత్సాహం వచ్చింది. ఈ నెల 8న హైకోర్టు 42% రిజర్వేషన్లపై స్టే ఇవ్వకుండా నిరాకరించడంతో, ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లు భావించారు. గురువారం నోటిఫికేషన్ వెలువడడంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై మండల కేంద్రాలు చురుకుగా మారాయి. దసరా వేడుకలను ఎన్నికల ప్రచారంగా మలచుకుని నేతలు గెలుపు లక్ష్యాలతో ముందుకు సాగారు. అయితే అదేరోజు మధ్యాహ్నం హైకోర్టు 42% రిజర్వేషన్లపై మధ్యంతర స్టే ఇవ్వడం ఆశావహులకు ఒక్కసారిగా షాక్ తగిలింది.
ఎన్నికల ప్రక్రియకు బ్రేక్..
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను గౌరవిస్తూ ఎ న్నికల సంఘం నామినేషన్ ప్రక్రియను నిలిపివేసింది. ఇప్పటివరకు సాగిన ఎన్నికల సమర కథ మళ్లీ మొదటికి చేరింది. ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో కాలయాపన జరుగుతోందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు.
మొదటి రోజు నామినేషన్లు..
ఇదిలా ఉంటే జిల్లాలో నోటిపికేషన్ వచ్చిన తొలి రోజే 5 చోట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. కొ న్ని ప్రధాన పార్టీల నాయకులు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. టికెట్ అవకాశం లేకపోవడంతో పార్టీ మార్చుకున్న వారూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేతలకు ఎన్నికల ప్రక్రియ నిలిపివేయడం తీవ్ర నిరాశను కలిగించింది.
గ్రామాల్లో అనిశ్చితి..
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 అమలును హైకోర్టు నిలిపివేయడంతో గ్రామాల్లో చర్చలు ముదిరాయి. పాత రిజ ర్వేషన్‌ల ప్రకారం ఎన్నికలు కొనసాగుతాయా? లేక పూర్తిగా నిలిపివేయబడుతాయా? ప్రభుత్వం తుది నిర్ణయం ఏమిటి? అని చర్చించుకుంటున్నారు.