
కూలేదాకా.. చూస్తారా..!?
నిర్మల్: ‘అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తాం.. ’ అని చెప్పే ప్రభుత్వం శిథిలావస్థకు చేరుతున్న కార్యాలయాలను కూలేదాకా చూస్తోంది. రెండురోజుల క్రితం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ఓ విభాగం పైకప్పు ఉన్నపళంగా కుప్పకూలింది. ఎప్పుడూ జనసంచారం ఉండే కార్యాలయం రాత్రివేళ కూలడంతో అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. మూడేళ్లక్రితం ఇలాగే.. నిర్మల్‌అర్బన్ పాత కార్యాలయం ముందుభాగం అందరూ చూస్తుండగానే ఓవైపు కూలిపోయింది. జిల్లాలో ఇప్పటికీ పలు కార్యాలయాల్లో అదే దుస్థితి ఉంది. ఎప్పుడు కూలుతాయో చెప్పలేని పరిస్థితులు ఉన్నా.. ఏళ్లుగా అలాగే, ఆ భవంతుల్లోనే కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు.
మున్సిపల్ మరీ దారుణం..
నిర్మల్ మున్సిపాలిటీ భవనం మరీ దారుణంగా తయారైంది. వర్షాకాలంలో పాత భనాల్లో ఉండొద్దని ప్రజలకు సూచించే అధికారులు, ఉద్యోగులే పాత, శిథిలావస్థకు చేరిన భవనంలో భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడో ఏళ్లక్రితం కట్టిన బిల్డింగ్ మొత్తం పెచ్చులూడిపోతోంది. ఇప్పటికే రెవెన్యూ, బిల్డింగ్, అకౌంట్స్, శానిటేషన్ తదితర సెక్షన్, కారిడార్‌లలో పెచ్చులూడి పడ్డాయి. ఇంకా చాలాచోట్ల ఎప్పుడైనా పడొచ్చు.. అన్నట్లుగా ఉన్నాయి. ప్రస్తుత మున్సిపాలిటీకి వెనుకవైపునే కొత్త భవనం నిర్మించినా.. వాస్తు బాగాలేదంటూ ప్రతీ పాలకవర్గం భవనం మార్పును వాయిదా వేస్తూ వస్తోంది. రూ.కోట్లు పెట్టి కట్టిన ఆ భవనంలో ప్రస్తుతం పనికిరాని సామాన్లు, సున్నం, బ్లీచింగ్‌పౌడర్ స్టోరేజీ కోసం వాడుతున్నారు. రెండుమూడు భారీవర్షాలు కురిస్తే.. ప్రస్తుతం కొనసాగుతున్న మున్సిపల్ భవనం మరింత ప్రమాదకరంగా మారడం ఖాయం.
కూలితే.. ఎవరు బాధ్యులు..!?
ఏదైనా ప్రమాదం జరిగితే బాధితులతోపాటు బాధ్యులూ ఉంటారు. ఇప్పుడు శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ కార్యాలయాలు కూలితే, ఎవరికై నా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులవుతారు..!? చాలావరకు రెవెన్యూ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. మండలంలోని భూములు, ప్రజలకు సంబంధించిన విలువైన సమాచారమంతా ఇవే కార్యాలయాల్లో ఉంటాయి. ఈ భవనాలు కుప్పకూలి, ఆయా సమాచారం దెబ్బతింటే ఎవరిది బాధ్యత..!? కార్యాలయ పనివేళల్లోనే అనుకోని ఘటనలు చోటుచేసుకుంటే.. పరిస్థితి ఎలా ఉంటుందని ఎవరైనా ఆలోచిస్తున్నారా..!? తాజాగా ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం ఘటన నేపథ్యంలోనైనా జిల్లాలోని శిథిలావస్థకు చేరిన భవనాలు, కార్యాలయాలపైన దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.
తలపగలడం ఖాయం..
చూస్తుంటూనే.. ఎక్కడ పడిపోతుందో.. అన్నట్లు ఉన్న ఈ పెచ్చులూడిన స్లాబ్ ఎక్కడో కాదు.. నిర్మల్ జిల్లా కేంద్రానికి గుండెకాయగా చెప్పుకునే మున్సిపాలిటీలోనిదే. రెవెన్యూ విభాగంలోకి అడుగుపెట్టగా నే ఇలా పెచ్చులూడిపోయి భయపెడుతోంది. ఇలా.. మున్సిపల్ ఈ ఒక్క విభాగంలోనే కాదు.. భవనం మొత్తం భయంకరంగానే తయారైంది.