
మా శ్రమను గుర్తించండి..!
భైంసా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల గోడు తక్కువ వేతనమిస్తున్నారంటూ ఆందోళన జీతాలు పెంచుతామని డబ్బులు వసూలు చేశారని ఆరోపణ విచారణకు కమిటీ నియమించిన కలెక్టర్
భైంసాటౌన్: ఇతర మున్సిపాలిటీల్లో మాదిరి తమ కూ పనికి తగిన వేతనం ఇవ్వాలని భైంసా పట్టణంలోని మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం ఆందోళన చేశారు. మున్సిపల్ కార్యాలయం ప్రధానగేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఇతర మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.16 వేల వేతనం ఇస్తుండగా, తమకు రూ.12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ బి.రాజేశ్‌కుమార్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ అక్కడికి చేరుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పినా.. వినిపించుకోలేదు. తమకు వేతనాలు పెంచుతామని చెప్పి శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ రూ.2,500 చొప్పున వసూలు చేశారని తెలిపారు. నాలుగు నెలలుగా పీఎఫ్ జమ చేసినట్లు ఫోన్లకు మెస్సేజ్‌లు కూడా రావడం లేదన్నారు. యూనిఫాంలు, రెయిన్ కోట్లు కూడా ఇవ్వకపోవడంతో వర్షంలో తడుస్తూ విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం చేతులకు గ్లౌస్‌లు, ఆఫ్రాన్లు ఇవ్వడం లేదని, చేతులతోనే చెత్తను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఒక్కరోజు విధులకు హాజరు కాకపోతే వేతనంలో వేల రూపాయలు కోత పెడుతున్నారని ఆరోపించారు.
నలుగురు సభ్యులతో విచారణ కమిటీ..
భైంసాలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగడం, డబ్బులు వసూలు చేశారంటూ ఆరో పణలు చేయడంతో, కలెక్టర్ అభిలాష అభినవ్ వెంటనే స్పందించారు. ఈ మేరకు భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్ అధ్యక్షతన డీపీవో, జిల్లా ఉపాధి కల్పన అధికారి, జిల్లా ఉద్యానశాఖ అధికా రి, పీఎఫ్ సభ్యుడితో కలిసి కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. భైంసా మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలపై పూర్తి విచారణ జరపాలని, రెండు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన విరమించారు.
అక్కడలా.. ఇక్కడిలా..!
జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య విభాగంలోని ఔట్‌సోర్సింగ్ కార్మికులకు నెలకు రూ.16 వేల వేతనం చెల్లిస్తున్నట్లు ఆయా మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, భైంసాలో మాత్రం రూ.12వేలు చెల్లిస్తుండడంతో, ఇక్కడి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారితో సమానంగానే తామూ విధులు నిర్వహిస్తున్నా.. తక్కువ వేతనం చెల్లించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
విచారణ కమిటీ ఏర్పాటు..
భైంసా మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.12 వేలు చెల్లిస్తున్నాం. ఇందులో నుంచి పీఎఫ్ పోగా రూ.10,680 ఖాతాల్లో జమవుతాయి. వేతనాలు పెంచుతామని రూ.2500 చొప్పున వసూలు చేసిన విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై కలెక్టర్ విచారణ కమిటీ నియమించారు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
– బి.రాజేశ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్, భైంసా
మున్సిపాలిటీల వారీగా
పారిశుద్ధ్య కార్మికుల వివరాలు
మున్సిపాలిటీ రెగ్యులర్ ఔట్‌సోర్సింగ్
నిర్మల్ 86 252
భైంసా 07 97
ఖానాపూర్ 01 36