
ఒక కెమెరా వందమంది పోలీసులకు సమానం
నిర్మల్‌టౌన్: ఒక సీసీ కెమెరా.. వంద మంది పోలీ సులతో సమానమని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనగర్‌కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను శనివారం ప్రారంభించారు. అంతకుముందు కాలనీలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు ప్రధాన ఆయుధమన్నారు. జిల్లా ప్రజల సహకారంతో ఇప్పటి వరకు 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇవన్నీ జియో ట్యాగింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశామని చెప్పారు. ఈ మధ్యకాలంలో జరిగిన జ్యువెలరీ దొంగతనం, షట్టర్ లిఫ్టింగ్ కేసు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో శ్రీనగర్ కాలనీ పట్టణంలోని అన్ని కాలనీలకు ఆదర్శంగా నిలిచిందని అభినందించారు. అనంతరం కాలనీవాసులు ఎస్పీని సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై సంజీవ్, శ్రీనగర్‌కాలనీ అధ్యక్షుడు భానుచందర్, ప్రధాన కార్యదర్శి రాకేశ్, కోశాధికారి సాయినాథ్, భూమయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.