
కొత్త రేషన్ కార్డులు 29,386
● మరో 63,595 మందికి పాత కార్డుల్లో చోటు ● త్వరలో ప్రొసీడింగ్స్ అందజేత ● జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 2,33,471 ● లబ్ధిదారులు 7,33,913 మంది
నిర్మల్‌చైన్‌గేట్: పేదలు ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల కల ఎట్టకేలకు సాకారం కానుంది. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ, సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడం ద్వారా ముందడుగు వేసింది. దశాబ్దాలుగా రేషన్ వ్యవస్థలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపుతూ, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహార ధాన్యాలను అందిస్తోంది. ఈనెల 22న మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు.
కొత్త కార్డులు, సభ్యుల చేరిక
పదేళ్లకుపైగా రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేరిక కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఊరట కల్పిస్తూ, ప్రభుత్వం పాత కార్డుల్లో సభ్యులను చేర్చడంతో పాటు కొత్త కార్డులను మంజూరు చే సింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 33, 982 రేషన్ కార్డు దరఖాస్తులను స్వీకరించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం, 29,386 కార్డులను మంజూరు చేసింది. అలాగే, 48,063 కుటుంబాల నుంచి 63,595 మంది కొత్త సభ్యు ల చేరిక కోసం దరఖాస్తు చేసుకోగా, వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
సంక్షేమ పథకాలకు తొలగిన అడ్డంకి..
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పొందడానికి రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో, ఏడేళ్లుగా కొత్త కార్డులు లేక అర్హులు ఈ పథకాల నుంచి దూరమయ్యారు. గ్యాస్ సబ్సిడీ, ఉ చిత కరెంట్ వంటి గ్యారంటీ పథకాలు అందుకోలేకపోయారు. 2018 నుంచి రేషన్ కార్డుల జారీ నిలిపివేయడంతో, ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో, ప్రజాపాలన కార్యక్రమం, మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించి, కొత్త కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది.
రేషన్ కార్డుల సంఖ్య..
జిల్లా వ్యాప్తంగా 412 రేషన్ దుకాణాల ద్వారా 2,33,471 కార్డులు, 7,33,913 మంది సభ్యులకు సేవలందుతున్నాయి. ప్రతినెలా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 4,253 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పౌరసరఫరాల శాఖ పంపిణీ చేస్తోంది. కొత్త కార్డులు, సభ్యుల చేరికతో అదనంగా 600 మెట్రిక్ టన్నుల కోటా పెరిగింది. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో 80% మంది మాత్రమే లబ్ధి పొందగా, సన్నబియ్యం పంపిణీతో ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది.
జిల్లాలోని మొత్తం రేషన్ కార్డులు
2,33,471
లబ్ధిదారులు: 7,33,913
నెలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం
: 4253 మెట్రిక్ టన్నులు
నూతన కార్డులకు వచ్చిన
దరఖాస్తులు: 33982
మంజూరు అయిన రేషన్ కార్డులు: 29,386
లబ్ధిదారులు : 89,308
మెంబర్ యాడింగ్‌కు వచ్చిన
దరఖాస్తులు 48,063
ఆమోదించిన దరఖాస్తులు 44,388
లబ్ధిదారులు: 63,595
పంపిణీకి ఏర్పాట్లు..
జిల్లాలో 29,386 కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రేషన్ కార్డుల్లో కొత్తగా పేర్ల నమోదు కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 22 లోపు ప్రొసీడింగ్ కాపీలు అందజేస్తాం. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశాం.
– బి.రాజేందర్,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

కొత్త రేషన్ కార్డులు 29,386