
విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి పెంచాలి
● జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు
నిర్మల్‌టౌన్: విజ్ఞానశాస్త్రంపై విద్యార్థుల్లో ఆసక్తి కలిగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జుమ్మెరాత్‌పేట్ పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న అటల్ టింకరింగ్ ల్యాబ్ శిక్షణ శిబిరాన్ని శుక్రవారం సందర్శించారు. విద్యార్థులను భవిష్యత్ శాస్త్రవేత్తలుగా రూపొందించడానికి అటల్ టింకరింగ్ శిక్షణ తోడ్పడుతుందన్నారు. ఈ ప్రయోగశాలను జిల్లాలోని 17 పాఠశాలలకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా పాఠశాలలకు విలువైన విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల పరికరాలు, ఒక లాప్‌టాప్, 25 టేబుళ్లు , మొత్తం రూ.25 లక్షల విలువైన సామగ్రి పాఠశాలలకు చేరిందన్నారు. వాటి వినియోగంపై రాష్ట్రస్థాయి నుంచి కోఆర్డినేటర్లు వచ్చి, జిల్లాలోని ఉపాధ్యాయులకు రెండు రోజులు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమన్వయకర్తలు నర్సయ్య, ప్రవీణ్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్, శిక్షణ రిసోర్స్ పర్సన్స్ కళ్యాణ్‌రెడ్డి, పవన్ నిరంజన్ , హెచ్‌ఎం రవిబాబు, భౌతికశాస్త్ర, జీవశాస్త్ర, గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.