
బాసర.. నో హాల్టింగ్
భైంసా: దేశంలో ప్రసిద్ధిగాంచిన సరస్వతీ అమ్మవారి క్షేత్రమైన బాసరకు నిత్యం రాష్ట్రంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. కాచిగూడ నుంచి జోథ్‌పూర్‌కు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు (17605/06) శనివారం నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని కాచిగూడలో ఈ రైలును ప్రారంభిస్తారు. ఈ రైలు ప్రతిరోజూ నడుస్తుంది.
బాసర భక్తుల నిరాశ
ప్రసిద్ధ సరస్వతీ క్షేత్రమైన బాసరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర నుంచి వేలాది భక్తులు వస్తారు. కానీ, ఈ రైలుకు బాసరలో హాల్టింగ్ లేకపోవడంతో భక్తులు, ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలు నిజామాబాద్‌లో మాత్రమే ఆగనుంది.
ఆధ్యాత్మిక మార్గం..
ఈ రైలు ఉజ్జయినీ జోతిర్లింగ క్షేత్రం మీదుగా వెళ్తుంది. బాసరలో హాల్టింగ్ ఇస్తే, గోదావరిలో పుణ్యస్నానాలు, జోతిర్లింగ దర్శనం కోసం వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. 2027లో గోదావరి నదికి పుష్కరాలు రానున్నాయి. ఈ సమయంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు బాసరకు రానున్నారు. ఈ సమయంలో ఈ రైలు హాల్టింగ్ మరింత కీలకం. ఉమ్మడి జిల్లా బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్ర రైల్వే మంత్రిని కలిసి విన్నవిస్తే బాసరలో రైలు నిలిచే అవకాశం ఉంది.
ఆగేలా చూస్తాం
కొత్తగా ప్రారంభమయ్యే రైలు అమ్మవారి క్షేత్రమైన బాసరలో ఆగేలా చూస్తాం. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ని కలిసి విన్నవిస్తాం. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీతో కలిసి కొత్త రైలుకు బాసరలో హాల్టింగ్ కోసం రైల్వే మంత్రిని కలుస్తాం.
– రామారావు పటేల్, ముధోల్ ఎమ్మెల్యే
నేడు కాచిగూడ–జోథ్‌పూర్ రైలు ప్రారంభం
తెలంగాణలో చివరి స్టేషన్‌లో
హాల్టింగ్ ఇవ్వని వైనం..