హామీలు నెరవేర్చి ‘స్థానిక’ ఎన్నికల్లో పోటీ చేయాలి
ఖానాపూర్: ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేశాకే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్‌రాథోడ్ అన్నారు. పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం మాట్లాడారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి ప్రజాకోర్టులోనే ఓటుతో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెబితేనే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చినట్టు అని పేర్కొన్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల నిధులన్నీ ఎక్కువగా కేంద్రప్రభుత్వానివే అని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి అప్పుల బాధ తీరుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అంకం మహేందర్, ఆకుల శ్రీనివాస్, పుప్పాల ఉపేందర్, కీర్తి మనోజ్, రవీందర్‌రెడ్డి, గిరి, వెంకట్రాములు, రమేశ్, పవన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


