మావోయిస్టుల లొంగుబాటు
‘కేబీఎం’ కార్యదర్శి ఎర్రగొల్ల రవితో సహా ఇతరులు మంచిర్యాల జిల్లాకు చెందిన మరొకరు.. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలో చిక్కిన ‘మావో’లు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల, కుమురంభీం(కేబీఎం) డివిజన్ కమిటీ కార్యదర్శి కామారెడ్డి జిల్లాకు చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ హైదరాబాద్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో లొంగిపోగా.. ఆ వివరాలను ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు ఎస్పీ చిత్తరంజన్ కూడా పాల్గొన్నారు. సీపీఐ(మావోయిస్టు)కి చెందిన 41మంది 24ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో ఇద్దరే తెలంగాణకు చెందిన వారు కాగా, 24ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కేబీఎం కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, పార్టీ సభ్యుడు జన్నారానికి చెందిన ప్రభంజన్ ఉన్నారు. మిగతా వారంతా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వివిధ కేడర్‌లో పని చేస్తున్న వారు ఉన్నారు.
అజ్ఞాతం వీడేందుకేనా..?
వచ్చే మార్చి నెలాఖరు వరకు మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు తమ పార్టీ కేడర్‌ను ఇతర ప్రాంతాలకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేర్వేరు చోట్ల ఆశ్రయం పొందుతున్నారు. మనుగడ క్లిష్టంగా మారడంతో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అలా ఇటీవల కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూ ఏజెన్సీ అటవీ ప్రాంతంలోకి కొందరు మావోయిస్టులు వచ్చినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. వారిని గుర్తించి అత్యంత గోప్యంగా పోలీసులు ఆయుధాలతో సహా హైదరాబాద్‌కు తరలించారు. వీరంతా ఛత్తీస్‌గఢ్ నుంచి ములుగు ఇతర ప్రాంతాల మీదుగా సిర్పూర్ యూ మండలం కకర్‌బుడ్డి, బాబ్జీపేట పరిసరాల్లో సంచరిస్తున్నారు. పెద్దదోబ, చిన్నదోబ పరిధిలో అటవీ సమీపంలోని ఓ చేనులో ఉన్న గుడిసెలో తల దాచుకున్నారు. గత కొద్దిరోజులుగా అక్కడే ఉంటున్నారు. వీరంతా ఇక్కడికి ఎలా చేరుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేళ అంతర్రాష్ట్ర సరిహద్దులతోపాటు జిల్లాలు, కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఉన్నాయి. ఈ తనిఖీలను దాటి ఎప్పుడు, ఎలా వచ్చారనేది మిస్టరీగా మారింది. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లాలో బలగాలు గుర్తించిన మావోయిస్టులే అజ్ఞాతం వీడారనేది ఉన్నతాధికారులు ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.


