● జిల్లా ఫలితాలపై అధిష్టానం ప్రశంసలు ● సర్పంచుల సన్మానా
బీజేపీలో ‘పల్లె’ జోష్..
నిర్మల్: పదేళ్ల క్రితం కనీసం వార్డు మెంబర్‌గా పోటీచేయడానికి కూడా పంచాయతీల్లో బీజేపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఇక సర్పంచ్ పదవికి నామమాత్రంగా నామినేషన్లు పడేవి. ఎన్నికల ఫలితాల్లో డిపాజిట్లు కూడా దక్కేవికావు. ఉమ్మడి జిల్లా మొత్తం కలిపి రెండు మూడు స్థానాలు మాత్రమే గెలిచేవి. పార్టీకి పల్లెల్లో కనీసం క్యాడర్ కూడా ఉండకపోయేది. అలాంటి బీజేపీ సిన్మా ఒక్కసారిగా మారిపోయింది. అరకొర కాదు, జిల్లాలోని 400 పంచాయతీల్లో ఏకంగా సగానికిపైగా సీట్లను కై వసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. తెలంగాణలో ఏ జిల్లాలో సాధించనన్ని జీపీలను కై వసం చేసుకోవడంతో ఆపార్టీ అధిష్టానం నిర్మల్‌పై దృష్టి పెట్టింది. జిల్లా కేంద్రంలోని రెడ్డిగార్డెన్స్‌లో శుక్రవారం పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ బలపర్చిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి, ఉపనేత పాయల్ శంకర్, ముధోల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రామారావుపటేల్, పాల్వాయి హరీశ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు యాతాలం చిన్నారెడ్డి, కరిపె విలాస్, నల్ల రవీందర్‌రెడ్డి, సీనియర్ నేతలు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, అల్జాపూర్ శ్రీనివాస్, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
221మందికి సన్మానం..!
పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతుదారులు ఎక్కువ గెలిచారనేదానిపై జిల్లాలో పోటాపోటీగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో బీజేపీ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో 221 మంది సర్పంచులను సన్మానిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో నిర్మల్ నియోజకవర్గం నుంచి 80 మందిని, ముధోల్ 103 మందిని, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి 38 మంది సర్పంచులను సన్మానించినట్లు పార్టీ పేర్కొంది. వీరితోపాటు ఉపసర్పంచ్‌లు, వార్డుమెంబర్‌లు, భారీసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతోపాటు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి ఎమ్మెల్యేలు మాట్లాడారు. పంచాయతీల్లో గెలిచినట్లే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
● జిల్లా ఫలితాలపై అధిష్టానం ప్రశంసలు ● సర్పంచుల సన్మానా


