విపత్తుల వేళ అప్రమత్తత అవసరం
నిర్మల్‌ఖిల్లా: ముందస్తు అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణ నష్టాలను నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ డ్రిల్ కార్యక్రమ నిర్వహణ, వైపరీత్యాల నివారణ నిర్వహణ చర్యలపై సీఎస్ రామకృష్ణారావు, జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) అధికారులతో కలిసి కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 22న నిర్వహించే విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. పరిస్థితులను అంచనా వేయగలిగితే నష్టాలను తగ్గించగలుగుతామని వివరించారు. వైపరీత్యాల సమయంలో సమాచార మార్పిడి అత్యంత కీలకమన్నారు. దాదాపు 35 శాఖలు సమన్వయంతో పని చేయాల ని సూచించారు. వర్షపాతం, ప్రాజెక్టుల నీటిమట్టం, నీరు విడుదల, వంతెనలు, రోడ్ల స్థితి వంటి అంశాల రియల్ టైమ్ సమాచారం ప్రజలకు చేరవేయాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య సేవలు అనేవి వైపరీత్యాల సమయంలో అత్యంత కీలకమన్నారు. రాష్ట్రంలోని ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలకు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహకారం అందిస్తాయని తెలిపారు. అత్యవసర సమయాల్లో హెలికాప్టర్ సేవలు వినియోగించుకోవచ్చన్నారు.
అన్నిరకాలుగా సిద్ధం..
కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. జిల్లాలో విపత్తుల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈనెల 22న మాక్ డ్రిల్ విజయవంతం చేస్తామన్నారు. ముందస్తు అప్రమత్తత, స్పష్టమైన ప్రణాళికలు, విపత్తుల అంచనా, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాల సమన్వయ చర్యలు, అధికార యంత్రాంగం, ప్రజల సహకారంతో నష్టాలు లేకుండా వరదలను ఎదుర్కున్నామని వివరించారు. ఇటీవల మండలానికి ఒకటి చొప్పున అత్యవసర సమయాల్లో ఉపయోగపడే వస్తువులతో కూడిన కిట్‌ను అందించామని చెప్పారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


