వానమ్మా.. జర ఆగమ్మా..! | - | Sakshi
Sakshi News home page

వానమ్మా.. జర ఆగమ్మా..!

May 28 2025 5:43 PM | Updated on May 28 2025 5:43 PM

వానమ్

వానమ్మా.. జర ఆగమ్మా..!

● వారం రోజులుగా జిల్లాను వీడని వరుణుడు ● కల్లాల్లో తడుస్తున్న ధాన్యం.. ● కొద్ది రోజులు ఆగాలని రైతుల వేడుకోలు ● తేమశాతం పెరగడంతో కోతలు
కొనుగోళ్లలో జాప్యంపై ఆందోళన

జొన్న రైతులకు నష్టం..

తానూరు: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. హిప్నెల్లి, బెంబర, తానూరుతోపాటుఆయా గ్రామాల్లో కొతకు వచ్చిన జొన్నపంట నెలావాలింది. కంకులకు మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మల్‌: ‘ఒక్కో యేడు ఎంత వేడుకున్నా జాడ కూడా ఉండవు. ఈయేడాదేమో.. జరంత ఆగుమంటే కూడా ఆగుతలేవు. గీ వడ్లు పోయేదాకన్నా ఓపిక పట్టమ్మా.. నీకు పుణ్యముంటది. చేసిన కష్టం చేతికందే వేళ.. నీళ్లపాలైతుంటే కన్నీళ్లు అగుతలేవు తల్లీ. ఇప్పటికే తాలుతప్ప అంటూ కోతలు పెట్టే మిల్లర్లు తడిసిన వడ్లంటే సగం పైసలే ఇస్తమంటరు. నిన్నే నమ్ముకుని బతికేటోళ్లం. అందరికీ అన్నం పెట్టేటోళ్లం. మమ్మల్ని పగబట్టినట్లు చేయకు..ఓ వానమ్మా.. జర ఆగిరావమ్మా..’ అంటూ కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యాన్ని తడికళ్లతో చూస్తూ వేడుకుంటున్నారు బాధిత రైతులు. జిల్లాల్లో ఇప్పటికే 80 శాతం వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తయినా.. మిగిలిన వడ్లను వాన ముంచేస్తోంది. తడిసిన, మొలకల వచ్చిన వడ్లంటూ మిల్లుల్లో బస్తాకు 4 కిలోల చొప్పున కోతలు పెడుతున్నారు.

అకాలంలో వచ్చిన అల్పపీడనం రైతన్నపైనే తీవ్ర ప్రభావం చూపుతోంది. అకాలం ముప్పు తొలగక ముందే.. రుతుపవనాలు రావడంతో పది రో జులుగా జిల్లాను వర్షాలు వీడడం లేదు. మబ్బులు కమ్ముకుని, ముసురు పెట్టినట్లు వాన కురుస్తూనే ఉంది. కొన్నిమండలాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకున్న, సంచుల్లో నింపిన ధాన్యం తడుస్తోంది. వివిధ కారణాలతో పలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇప్పటికే తడిసిన ధాన్యానికి మొలకలూ వస్తున్నాయి. ఇక జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖతోపాటు జిల్లా అధికారులూ హెచ్చరిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

వరదలో ధాన్యం..

కుంటాల: మండలంలో మంగళవారం సాయంత్రం భారీవర్షం కురిసింది. లింబా(కె), కుంటాల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి పోయింది. కుప్పల నుంచి వరద నీరు తొలగించేందుకు రైతులు తిప్పలు పడ్డారు. కారు మబ్బులు కమ్ముకోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు.

పొంగిన వాగులు..

కడెం: మండలంలోని ఉడుంపూర్‌, మిద్దెచింత, గండిగోపాల్‌పూర్‌, ఇస్లాంపూర్‌, తదితర గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు.

సారంగపూర్‌: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై మండలంలోని ధని గ్రామానికి చెందిన రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. నిర్మల్‌–స్వర్ణ రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై మొలకెత్తిన ధాన్యం పోసి గంటన్నరపాటు ఆందోళన చేశారు. వర్షాల కారణంగా పంట కోయకుండా పొలాల్లోనే ఉండిపోయి నష్టపోతున్నామని తెలిపారు. ఇక, మార్కెట్‌కు తరలించిన ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో నష్టపోతున్నామని పేర్కొన్నారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కయి రైతులను దోచుకునేందుకు ప్రణాళిక రూపొందించారని ఆరోపించారు. క్వింటాల్‌కు 6 కిలోల ధాన్యం అదనంగా తూకం వేస్తున్నారని తెలిపారు. నిర్మల్‌ రూరల్‌ సీఐ కృష్ణ రైతులను సముదాయించేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. సివిల్‌ సప్లయ్‌ అధికారులతో మాట్లాడతామని ఫోన్‌ద్వారా అధికారులను సీఐ సంప్రదించి ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతుల ఆందోళనతో ఈరహదారిపై రాకపోకలు స్తంభించాయి. పోలీసులు బోరిగాం మీదుగా వాహనాలను మళ్లించారు.

ఆందోళన చేస్తున్న ధని గ్రామ ఽ రైతులు

ఆందోళనలో రైతన్న..

‘ఇదేం కాలమో.. ఏమో..! ముందస్తుగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది..’ అంటూ చాలామంది రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఆలస్యంగా సాగు చేసి, హార్వెస్టర్లు సమయానికి అందుబాటులో లేక వరి కోతలు చేయనివాళ్లు, కోతలు కోసి ఆరబెట్టుకున్నవాళ్లు, సంచుల్లో నింపి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్న రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్నీ కొంటామంటూ ప్రభుత్వం, జిల్లా అధికారులు భరోసా ఇస్తున్నా.. సదరు ధాన్యానికి రైసుమిల్లర్లు పెడుతున్న కొర్రీలు రైతులకు ఇబ్బంది పెడుతున్నాయి.

ధాన్యం కొనుగోలు వివరాలు..

ధాన్యం కొనుగోలు అంచనా

1,62,000 మెట్రిక్‌ టన్నులు

కొనుగోలు కేంద్రాలు 318

కొనుగోలు చేసిన ధాన్యం

1,33,000 మెట్రిక్‌ టన్నులు

ఇంకా రావాల్సిన ధాన్యం

40 వేల మెట్రిక్‌ టన్నులు

కోతలు తప్పవు..

ప్రభుత్వం గ్రేడ్‌–ఏ ధాన్యం క్విటాల్‌కు రూ.2,320, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.2,300 చొప్పున మద్ధతు ధర చెల్లిస్తోంది. ఈ ధర దక్కాలంటే ధాన్యంలో తేమ 17శాతం మించకూడదు. కానీ.. అకాలవర్షంతో ఆగమైన వాతావరణం రైతన్నను పరేషాన్‌ చేస్తోంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో తేమశాతం అటుంచి, ధాన్యం తడవకుండా చూసుకోవడం రైతులకు పెద్ద పరీక్షగా మారింది. టార్పాలిన్లను కప్పుతూ.. తీస్తూ.. ధాన్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇక తడిసిన ధాన్యాన్నీ సర్కారు ఆదేశాల మేరకు కొనుగోలు చేస్తున్నా.. రైసుమిల్లర్లు సంచికి 3–4 కిలోల కోత తప్పదంటున్నారు.

ఏం చేయాలో తెలుస్తలేదు..

నాకున్న ఎకరంన్నరతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి వేసుకున్న. అకాలవర్షం కారణంగా ఇంతవరకు కోత కోయలేదు. ఇప్పుడింకా వానలు పడుతాయంటున్నారు. ఏం చేయాలో తెలుస్తలేదు.

– వాసాల పోశెట్టి, జామ్‌, మం.సారంగపూర్‌

తడిసిన ధాన్యం కొనుగోలు..

తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు లారీలలో లోడ్‌ చేయించి, రైసుమిల్లులకు తరలిస్తున్నాం. సాధ్యమైనంత వరకు రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ప్రయత్నిస్తున్నాం.

–కిశోర్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌

లింబా(కె)లో వర్షపునీరు తొలగిస్తున్న రైతు

వానమ్మా.. జర ఆగమ్మా..!1
1/7

వానమ్మా.. జర ఆగమ్మా..!

వానమ్మా.. జర ఆగమ్మా..!2
2/7

వానమ్మా.. జర ఆగమ్మా..!

వానమ్మా.. జర ఆగమ్మా..!3
3/7

వానమ్మా.. జర ఆగమ్మా..!

వానమ్మా.. జర ఆగమ్మా..!4
4/7

వానమ్మా.. జర ఆగమ్మా..!

వానమ్మా.. జర ఆగమ్మా..!5
5/7

వానమ్మా.. జర ఆగమ్మా..!

వానమ్మా.. జర ఆగమ్మా..!6
6/7

వానమ్మా.. జర ఆగమ్మా..!

వానమ్మా.. జర ఆగమ్మా..!7
7/7

వానమ్మా.. జర ఆగమ్మా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement