ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన ముగ్గురిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసి బాధితుడి నుంచి డబ్బులు వసూలు చేసిన దుర్గం ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆదివారం టూటౌన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని అంకోలి గ్రామానికి చెందిన మెస్రం రాహుల్ 2024 ఏప్రిల్‌లో దుర్గం శేఖర్ సొసైటీకి చెందిన మహేందర్, మోహన్‌లకు రూ.40వేలు ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగానికి నెలకు రూ.15వేల చొప్పున ఇస్తామని చెప్పి ఎలాంటి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తన డబ్బులు తనకు ఇవ్వాలని వారిని అడగగా వారు నిరాకరించారు. దీంతో బాధితుడు టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కై లాస్‌నగర్‌కు చెందిన దుర్గం శేఖర్‌ను, కేఆర్‌కే కాలనీకి చెందిన కావటి మోహన్‌ను అరెస్టు చేయగా, మహేందర్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీరు ఇప్పటివరకు మరో ఆరుగురిని మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. సంస్థ ద్వారా మోసపోయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని వివరించారు. ఉద్యోగాల పేరిట మోసం చేసే బ్రోకర్లు, నకిలీ సంస్థలను నమ్మవద్దని, డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందన్నారు. నిరుద్యోగులను ఎవరైనా మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


