నేటి నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
● పది, ఇంటర్ విద్యార్థులకు నిర్వహణ ● ఏర్పాట్లు చేసిన అధికారులు
నిర్మల్ రూరల్: జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26 వరకు కొనసాగుతాయి. దీనికోసం అధికా రులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పదో తరగతి పరీక్షల కోసం భైంసా పట్టణంలోని కిసాన్‌గల్లి జెడ్పీహెచ్‌ఎస్, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల కస్బాలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల కోసం భైంసా పట్టణంలోని మదీనా కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా కేంద్రంలోని ఈద్‌గాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జుమ్మేరాత్‌పేట్ ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్, రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలను నియమించారు. 20 విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను కేటాయించారు. పదో తరగతి పరీక్షకు 660 మంది, ఇంటర్ పరీక్షకు 458 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలలో మంచినీటి సౌకర్యం, ఫర్నిచర్, ఫ్యాన్లు, టాయిలెట్లు సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. ఐదు నిమిషాలకు మించి ఆలస్యంగా వస్తే అనుమతించమని డీఈవో రామారావు తెలిపారు. పరీక్ష రాసే ప్రతీ విద్యార్థి హాల్‌టికెట్‌తోపాటు ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించాలన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. సందేహాలుంటే డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం నంబర్ 90599 87730లో సంప్రదించాలని సూచించారు.


