‘ఓపెన్’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్‌టౌన్: ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివి ధ శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12వరకు టెన్త్, మ ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఆరు పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 697 మంది, ఇంటర్ పరీక్షలకు 511 మంది విద్యార్థులు హాజ రు కానున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లు తాత్కాలికంగా మూసివేయాలని సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, పరీక్షల సమయానికి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపాలని, పరీక్షాకేంద్రాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏఎస్పీ ఉపేంద్రరెడ్డి, జిల్లా విద్యాధికారి రామారావు, ఏసీజీఈ పరమేశ్వర్, డీఎంహెచ్‌వో రాజేందర్, సీడీపీవో నాగమణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పంపిణీకి సిద్ధంగా హాల్‌టికెట్లు
నిర్మల్ రూరల్: జిల్లాలో ఈనెల 20నుంచి నిర్వహించనున్న సార్వత్రిక 10, ఇంటర్ పరీక్షలకు హాజర య్యే అభ్యర్థుల హాల్‌టికెట్లు ఆయా అధ్యయన కేంద్రాలకు అందజేసినట్లు జిల్లా ప్రభుత్వ పరీక్షల విభాగ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ తెలిపారు. ఉదయం 9నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపుకార్డుతో అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాలని తెలిపారు. ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యమైతే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఈ నెల 26నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రాక్టికల్ పరీక్షల కోసం హాల్ టికెట్లు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఆయా అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లు హాల్‌టికెట్లు తీసుకువెళ్లాలని పరమేశ్వర్ సూచించారు.


