ఇంటర్‌ ఎక్కడైతే బాగుంటుంది.. | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఎక్కడైతే బాగుంటుంది..

Published Fri, Apr 12 2024 11:55 PM | Last Updated on Fri, Apr 12 2024 11:55 PM

- - Sakshi

● ఏ కోర్సులో చేర్పించాలి.. ● పై చదువులపై తల్లిదండ్రుల ఆరా.. ● ఇప్పటికే పలు కాలేజీల్లో అడ్మిషన్లు ● ఇంటి వరకూ వస్తున్న ‘కార్పొరేట్లు’ ● భారం కావొద్దంటున్న మానసిక నిపుణులు

జిల్లా కేంద్రానికి చెందిన పవన్‌ది మధ్యతరగతి కుటుంబం. చిన్నపాటి దుకాణం నడుపుతూ భార్య, ఇద్దరు బిడ్డలను పోషించుకుంటున్నాడు. పెద్దబిడ్డ మొన్ననే పదోపరీక్షలు రాయగా, రెండో బిడ్డ 7వ తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి తాను బాగా చదవనందునే తన పరిస్థితి ఇలా తయారైందన్న ఆలోచనతో పవన్‌ తన పిల్లలిద్దరికీ మంచి చదువులు చెప్పిస్తున్నాడు. పెద్దబిడ్డ పదోతరగతి పరీక్షలు పూర్తికావడంతో ఇంటర్‌ ఎక్కడ చదివించాలి, తనను ఏ కోర్సులో జాయిన్‌ చేయాలన్న ఆలోచనలో పడ్డాడు. తనకు తెలిసిన టీచర్లు, బాగా చదివిన మిత్రులను అడుగుతున్నాడు. తమ బిడ్డను తీసుకుని తల్లిదండ్రులిద్దరూ ఇప్పటికే ఓసారి హైదరాబాద్‌ వరకూ వెళ్లారు. మూడునాలుగు కాలేజీలను చూసోచ్చారు. అయినా వారికి ఎటూ పాలుపోవడం లేదు. ఫీజులు చూస్తే భారీగా ఉన్నాయి.. మరి అదేస్థాయిలో అక్కడ చదువులు ఉంటాయా..? నాణ్యమైన ఆహారం పెడతారా..? తమ బిడ్డ అక్కడి వాతావరణాన్ని తట్టుకుంటుందా..? ఇలా ఎన్నో ఆలోచనలు పవన్‌ మదిలో తిరుగుతున్నాయి. ఇదంతా ఒకెత్తు.. ఆ రూ.లక్షలుగా ఉన్న ఫీజు డబ్బులు చెల్లించడం ఒకెత్తు.. అంటూ భార్య చెప్పిన మాటలూ తరచూ గుర్తుకు వస్తున్నాయి. పవన్‌ ఒక్కడికే కాదు.. ఆయనలాంటి తల్లిదండ్రులందరూ ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నారు. పదో తరగతి పరీక్షలు రాసిన తమ పిల్లల చదువులు, వారి భవిష్యత్తుపైనే ఆలోచన చేస్తున్నారు.

నిర్మల్‌రూరల్‌: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులకు పిల్లల చదువులపైనే బెంగ ఉంది. తమ సంపాదనలో సగానికిపైగా వారి చదువులకే పెట్టాల్సి వస్తోంది. చాలామంది అప్పులు చేసి మరీ.. ఫీజులు కడుతున్నారు. పిల్లల చదువుల కోసమే ఉన్న ఊళ్లను విడిచి నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌ వంటి పట్టణాలు, నగరానికి వెళ్తున్న కుటుంబాలూ చాలానే ఉన్నాయి. నిర్మల్‌ జిల్లా కేంద్రమైన తర్వాత విద్యావ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. పదుల సంఖ్యలో కార్పొరేట్‌ కాలేజీలు నెలకొల్పారు. ఏ కాలేజీ అయితే బాగుంటుందో తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. కొందరు జిల్లా కేంద్రంలో అడ్మిషన్‌ తీసుకుంటుండగా మరికొందరు తమ స్తోమత కొద్దీ నిజామాబాద్‌, హైదరాబాద్‌ నగరాల్లో ఉన్న ఫేమస్‌ కాలేజీల్లో పిల్లలను జాయిన్‌ చేస్తున్నారు.

ఇంటి వరకు వస్తున్న కార్పొరేట్లు....

పది పరీక్షలు ముగియడంతో ఇక కార్పొరేట్‌ కాలేజీలు అడ్మిషన్ల కోసం పల్లె, పట్టణ ప్రాంతాలపై ఫోకస్‌ పెట్టాయి. ఏజెంట్లను నియమించుకు అడ్మిషన్ల దందా మొదలు పెట్టాయి. ప్రైవేట్‌ వారితోపాటు.. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా కమిషన్‌కు ఆశపడి కార్పొరేట్‌ ఏజెంట్లుగా పని చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారికి నెలవారీ జీతాలు అందించడంతోపాటు, భారీ మొత్తంలో కమీషన్లు కూడా ముట్ట చెబుతున్నారు. సదరు ఏజెంట్లు తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు, ఇంటి అడ్రస్‌లు తెలుసుకుని మరీ ఇంటికి వచ్చి విద్యార్థుల అడ్మిషన్‌ చేస్తున్నారు. దీంతో మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్‌ కాలేజీలో చేర్పించాలంటేనే బెంబేలెత్తుతున్నారు.

సామాన్యులకు అందని ఫీజులు..

పదో తరగతి వరకు తమ పిల్లల చదువు కోసం వేలల్లో ట్యూషన్‌ ఫీజు చెల్లించిన తల్లిదండ్రులు ఇంటర్మీడియట్‌ కోసం లక్షల్లో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంతోపాటు భైంసా, ఖానాపూర్‌ పట్టణాలలో పదుల సంఖ్యలో ఇంటర్మీడియట్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో ట్యూషన్‌ ఫీజు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, నోట్‌ బుక్కులు, పరీక్ష ఫీజులు అదనం. నిజామాబాద్‌, హైదరాబాద్‌ వంటి కార్పొరేట్‌ కాలేజీల్లో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఫీజులు ఉంటున్నాయి. ఆర్థికంగా లేనివారు మాత్రం ప్రభుత్వ కళాశాల వైపు చూస్తున్నారు. మరికొందరు తమ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని అప్పు చేసి కార్పొరేట్‌ కళాశాలలో చేర్పిస్తున్నారు. ఏది ఏమైనా ఇంటర్మీడియట్‌ కార్పొరేట్‌ చదువులు మధ్యతరగతి, దిగువస్థాయి తల్లిదండ్రులకు భారంగా మారుతున్నాయి.

కార్పొరేట్‌ మాయలో పడొద్దు..

తల్లిదండ్రులు కార్పొరేట్‌ మాయలో పడొద్దు. కార్పొరేట్‌ కాలేజీల్లో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోంది. దీంతో విద్యార్థులు అనాలోచితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ కళాశాలల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. తమ ఆర్థిక వెసులుబాటు మేరకు తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలి. పిల్లలపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

– డాక్టర్‌ సురేశ్‌, మానసిక నిపుణుడు

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement