
ఎర్ర బంగారం..
● తెగుళ్ల కారణంగా తగ్గిన దిగుబడి ● డిమాండ్ లేదని పతన మవుతున్న ధర ● వాతావరణ మార్పులతో మరింత ప్రభావం ● దిక్కుతోచని స్థితిలో మిర్చి రైతులు ● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
మిర్చి పంటలో పశువులను
మేపుతున్న రైతు
క్వింటాల్‌కు రూ.8 వేలే..
నాలుగు ఎకరాల్లో మిర్చి పంట సాగుచేశా. పూత, కాత దశలో ఎండు తెగులు సోకింది. పంట దిగుబడి బాగా తగ్గింది. వచ్చిన దిగుబడిని వరంగల్ మారె్‌క్‌ట్‌కు తీసుకెళ్లి క్వింటాల్‌కు రూ.8 వేలకే విక్రయించిన. ఇప్పుడు పంట మొత్తాన్ని దున్నేశా.
– చోటేమియా, రైతు, ఓలా
దిగుబడి తగ్గింది..
మిర్చి సాగుకు ఎకరానికి రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టిన. వాతావరణ పరిస్థితుల కారణంగా ధరలు పడిపోయాయి. కాయలు ఏరినా కూలీలకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. చేసేదేమీ లేక పంటలో పశువులను మేపుతున్న. ప్రభుత్వం ఆదుకోవాలి.
– ఎల్లమ్మల శంకర్, రైతు, కుంటాల
కుంటాల: మంచి దిగుబడి వస్తుందని మిర్చి సాగు చేసిన రైతులకు ఈ ఏడాదీ నిరాశే మిగిలింది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగుచేస్తే తెగుళ్లు, వర్షాల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో చాలా మంది రైతులు పంటను చేలల్లోనే దున్నేయగా, మరికొందరు పశువులను మేపుతున్నారు.
పడిపోయిన ధరలు..
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి పంటకు డిమాండ్ లేకపోవడంతో అమాంతంగా ధరలు పడిపోయాయి. నిర్మల్ జిల్లాలో ఈయేడు 560 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. రెండు మూడు రోజులుగా వాతావరణంలో మార్పులతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంట దిగుబడి అంతంత మాత్రంగా ఉందని, ఈ సమయంలో వర్షాలు కురిస్తే కాయలు నల్లబడి ధర మరింత పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ప్రారంభంలో క్వింటాల్‌కు రూ.21 వేల నుంచి రూ.22 వేలు ధర పలికిన ఎర్ర బంగారం.. ఇప్పుడు రూ.8 వేల నుంచి రూ.13 వేల వరకు మాత్రమే ఉంది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
తెగుళ్లతో తగ్గిన దిగుబడి..
ఎన్నో ఆశలతో ఎర్ర బంగారాన్ని సాగు చేసిన రైతులకు ఆది నుంచి కష్టాలు తప్పడం లేదు. పూత, కాత దశలోనే పంటకు ఎండుతెగులు సోకింది. ఎకరాకు 50 నుంచి 60 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 20 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక జిల్లాలో మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో వచ్చిన దిగుబడిని కూడా దళారులకే అమ్మకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మంచి దిగుబడి వస్తే నాగపూర్ మార్కెట్‌కు తరలించాలనుకున్న రైతులకు తగ్గిన దిగుబడి నిరాశే మిగిల్చింది. ఇక మూడు రోజులుగా వాతావరణంలో మార్పులతో చేతికి వచ్చిన పంటను ఆరబెట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు కురిస్తే మరింత నష్టపోతామని పేర్కొంటున్నారు. దిగుబడి, ధర తగ్గడంతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు.

