
రెడ్డి దీపిక (ఫైల్)
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం ముల్కల్ల శివారులోని ఓ ఇటుకబట్టీలో రెడ్డి దీపిక(3) అనే చిన్నారి అస్వస్థతతో మృతి చెందిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. కోటపల్లి మండలం నక్కలపల్లికి చెందిన రెడ్డి శారద, రాములు దంపతులు ముల్కల్ల ఇటుక బట్టీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతుల కుమార్తె దీపిక మంగళవారం ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైంది. వాంతులు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇటుకబట్టి యజమాని గుట్టుచప్పుడుగా చిన్నారి మృతదేహాన్ని సొంతూరికి తరలించి అక్కడే అంత్యక్రియలు జరిపించారు. కాగా ఇటుకబట్టీల యజమానులు కూలీల ఆరోగ్యంపై పట్టించుకోకుండా వారి ప్రాణా లతో చెలగాలమాడుతున్నారని కార్మిక సంఘాల నా యకులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.