
ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు చేయాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. పర్యావరణానికి ప్లాస్టిక్ హానికరంగా మారుతోందని, మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించాలన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మహిళా సంఘాల సహకారంతో కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. పంచాయతీ స్థాయిలో ప్లాస్టిక్ నిషేధానికి అనుగుణంగా తీర్మానాలు చేయాలన్నారు. కలెక్టరేట్‌లో ఇప్పటికే స్టీల్ బాటిళ్లు వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల తయారీ, విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉల్లంఘించిన వారికి జరిమానాలు, వ్యాపార లైసెన్సులను రద్దు చేయడం సహా చట్టపరమైన చర్యలకు వెనకాడొద్దని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూట్, పేపర్ సంచుల తయారీ కేంద్రాలను మహిళా సంఘాలతో ఏర్పాటు చేయాలన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చాలని, దోమల నియంత్రణకు ఫాగింగ్ యంత్రాలను సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవోలు రత్నాకళ్యాణి, కోమల్‌రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్, రాజేశ్‌కుమార్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.