ఇనుప రాడ్లు, కర్రలతో దాడి
లాఠీఛార్జ్ చేసిన పోలీసులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం
చండీగఢ్: కపుర్తలా జైలులో ఖైదీలు బీభత్సం సృష్టించారు. ఇనుపరాడ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించిన జైలు అధికారులపైనా దాడికి దిగారు. దీంతో బాష్పవాయువు ప్రయోగించి, లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు ఖైదీల నుంచి ఇనుప రాడ్లు, కర్రలు, మొబైల్ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు ఖైదీలు గాయపడగా, మరో ఖైదీ బాష్పవాయువు షెల్ తగలడంతో గాయపడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే కపుర్తలా సెంట్రల్ జైలులోని బ్లాక్–4కు చెందిన కొందరు ఖైదీల మధ్య శనివారం రాత్రి ఒక విషయంపై ఘర్షణ మొదలైంది. ఇరువర్గాలు ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. కొంతమంది ఖైదీలు తమ బ్యారక్‌ల బయట నిప్పు పెట్టారు. కొందరు ఖ:దీలు బ్యారక్ నుంచి బయటకు వచ్చి దాని పైకప్పుపైకి చేరుకున్నారు. కొందరు బ్యారక్ పైకప్పుకు దారితీసే గేటును, ఇనుప గ్రిల్‌ను పగలగొట్టారు.
ఘర్షణ నివారించేందుకు ప్రయత్నించిన అధికారులపైనా ఖైదీలు దాడి చేశారు. దీంతో జైలు అధికారులు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్‌గ్యాస్ షెల్స్ ఉపయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. ఖైదీలను శాంతింపజేసి తిరిగి వారిని బ్యారక్‌లోకి పంపించారు. జైలు ఆవరణలో జరిగిన గొడవకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. బ్లాక్–4లో ఉన్న ఖైదీలందరూ క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న కరడుగట్టిన నేరస్థులని కపుర్తలా ఎస్పీ గౌరవ్ తూరా తెలిపారు.
బ్లాక్–4’లో తనిఖీలు నిర్వహించి సంఖ్యలో ఇనుప రాడ్లు, కర్రలు, మొబైల్ ఫోన్లను స్వా«దీనం చేసుకున్నామని చెప్పారు. జైలు ఆవరణలో గొడవ సృష్టించిన ఖైదీలపై, అలాగే మొబైల్ ఫోన్లు ఉపయోగించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పంజాబ్‌లో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు కపుర్తలా జైలులో జరిగిన హింసాకాండ ఒక ఉదాహరణని శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ విమర్శించాయి. అత్యంత భద్రత గల జైళ్లు కూడా యుద్ధభూములుగా మారుతుంటే, సామాన్య పౌరులకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించాయి.


