పుదుచ్చేరిలో విజయ్ ‘వరాల విశ్వరూపం’ | Vijay promises 25 lakh medical insurance free power in Puducherry | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరిలో విజయ్ ‘వరాల విశ్వరూపం’

Apr 4 2026 1:39 PM | Updated on Apr 4 2026 2:51 PM

 Vijay promises 25 lakh medical insurance free power in Puducherry

పుదుచ్చేరి: తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ తన దూకుడును మరింత పెంచారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేళ శనివారం ఆయన ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ప్రజల అవసరాలే అజెండాగా, వినూత్న హామీలతో విజయ్ ఓటర్ల ముందుకు వచ్చారు.

వరాల జల్లు: రూ. 25 లక్షల బీమా, ఉచిత విద్యుత్!
ప్రచార సభలో ప్రసంగించిన విజయ్, తమ పార్టీ అధికారంలోకి వస్తే పుదుచ్చేరిలోని ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేదరికం కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకూడదన్నదే తమ లక్ష్యమని విజయ్‌ పేర్కొన్నారు. దీంతో పాటు బీపీఎల్ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించి సామాన్యులను ఆకట్టుకున్నారు.

విద్యా రంగం.. స్థానిక పాలన
కేవలం సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధిపై కూడా విజయ్ దృష్టి సారించారు. పుదుచ్చేరిలో విద్యార్థుల కోసం యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ‘టీవీకే అభ్యర్థులు ప్రజల పక్షాన నిలబడతారు ప్రజల కోసం పనిచేస్తారు’ అని ఆయన పేర్కొన్నారు.

జాతీయ పార్టీలపై నిప్పులు
పుదుచ్చేరికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా విషయంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయని విజయ్ విమర్శించారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించకుండా ఇక్కడి ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. తమిళనాడు రాజకీయాల్లో ఉన్న గందరగోళమే ఇక్కడి కూటముల్లో కూడా కనిపిస్తోందని ఎద్దేవా చేసిన విజయ్.. ఈ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.

 ఇది కూడా చదవండి: అమెరికా షాకింగ్ డెసిషన్: భారత డ్రైవర్లపై భారీ వేటు!

Advertisement
 
Advertisement
Advertisement