అద్భుతమైన అనుభవం: రూబియో
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో సోమవారం బిజీబిజీగా గడిపారు. భార్య జీనెట్ రూబియో, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో కలిసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను, రాజస్తాన్ రాజధాని జైపూర్‌లోని అంబర్ కోటను సందర్శించారు. తాజ్‌మహల్ సందర్శన అద్భుతమైన అనుభవమని మార్కో రూబియో కొనియాడారు. ‘‘ప్రపంచంలోని గొప్ప ప్రేమ సౌధాలలో ఒకటైన తాజ్‌మహల్‌ను సందర్శించడానికి మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు’’అంటూ సందర్శకుల పుస్తకంలో రాశారు.
అమెరికాలో వెచ్చని వాతావరణం ఉంటే మియామీలో జన్మించిన రూబియో నిండు వేసవిలో ఆగ్రాలోని మండుటెండకు పెద్దగా చలించనట్లే కనిపించారు. అయితే, ఫొటోలకు పోజులిచ్చే ముందు ఆయన తన నెక్ టైని తీసివేశారు. తాజ్‌మహల్ సందర్శన అనంతరం ప్రత్యేక విమానంలో జైపూర్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు రాజస్తానీ పద్ధతిలో సంప్రదాయ స్వాగతం లభించింది. 16వ శతాబ్దంలో నిర్మించిన ప్రాచీన అంబర్ కోటను ఆసక్తిగా తిలకించారు. అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యారు. జానపద నృత్యాలతో కళాకారులు అలరించారు.
నేడు క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం
మార్కో రూబియో మంగళవారం ఢిల్లీలో ‘క్వాడ్’విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి ఆ్రస్టేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు హాజరు కాబోతున్నారు. ‘క్వాడ్’లో భారత్, ఆమెరికా, ఆ్రస్టేలి యా, జపాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత, ఇండో–పసిఫిక్‌లో భద్రత వంటి కీలక అంశాలపై క్వాడ్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
అరుదైన ఖనిజాలు, టెక్నాలజీ సహా కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై విదేశాంగ మంత్రులు చర్చించబోతున్నారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ కోసం క్వాడ్ దార్శనికత ఈ చర్చల్లో ప్రధానాంశంగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సంకేతాలిచ్చింది. అలాగే ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి మంగళవారం నాటి సమావేశంలో విస్తృత ఎజెండాను నిర్ధారించే అవకాశం ఉంది. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సు గత ఏడాది అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగింది.
తాజ్ చరిత్ర తెలిసి ఉంటే ఫొటో దిగే వారు కాదేమో
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమవారం ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించడం పట్ల హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం స్పందించింది. ‘‘రూబియోకు తాజ్‌మహల్ చరిత్ర తెలిసి ఉంటే ఆయన ఆ స్మారక చిహ్నం వద్ద ఫొటోకు పోజు ఇచ్చి ఉండేవారు కాదు’’అని తేల్చిచెప్పింది. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ‘‘మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఇరానియన్ భార్యపై ఉన్న ప్రేమతో, ఇరానియన్ వాస్తుశిల్పుల మేధస్సుతో తాజ్‌మహల్‌ను నిర్మించారు.
మరోవైపు అమెరికా ప్రభుత్వం నేడు ఇతర నాగరికతలను అవమానిస్తూ, ఇరానియన్ నాగరికతను తుడిచిపెట్టేస్తామని బెదిరిస్తోంది’’అని ఆరోపించింది. తాజ్‌మహల్ ఎదుట భార్యతో పాటు రూబియో దిగిన ఫొటోను ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం షేర్ చేసింది. షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ 1593లో ఆగ్రాలో జన్మించారు. ఆమె అసలు పేరు అర్జుమంద్ బాను బేగం. ఆమె తండ్రి అబ్దుల్ హసన్ అసఫ్ ఖాన్ ఒక పర్షియన్(ఇరాన్) రాజకుటుంబానికి చెందిన వ్యక్తి అని చరిత్ర చెబుతోంది.


