పెద్దల సభకు ఉజ్వల్‌ నికమ్‌ | Ujjwal Nikam Nominated to Rajya Sabha by President Murmu | Sakshi
Sakshi News home page

రాజ్యసభకు ప్రముఖుల నామినేట్‌.. జాబితా ఇదే..

Jul 13 2025 10:23 AM | Updated on Jul 14 2025 5:40 AM

Ujjwal Nikam Nominated to Rajya Sabha by President Murmu

హర్షవర్ధన్‌ శ్రింగ్లా,  మీనాక్షి జైన్, సి.సదానందన్‌ మాస్టర్‌లకు సైతం అవకాశం

రాజ్యసభకు నలుగురిని నామినేట్‌ చేసిన రాష్ట్రపతి ముర్ము

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నలుగురు ప్రతిభావంతులను రాజ్యసభకు నామినేట్‌ చేశారు. 26/11 ముంబయి ఉగ్రవాద దాడి కేసులో స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేసి, పాకిస్తాన్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌కు ఉరిశిక్ష పడేలా కీలక పాత్ర పోషించిన సీనియర్‌ లాయర్‌ ఉజ్వల్‌ నికమ్, చరిత్రకారిణి డాక్టర్‌ మీనాక్షి జైన్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్లా, కేరళ బీజేపీ నేత సి.సదానందన్‌ మాస్టర్‌లు పెద్దల సభకు నామినేట్‌ అయ్యారు.

 రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 80(1)(ఎ) క్లాజ్‌ (3) కింద తనకు లభించిన అధికారం మేరకు ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు ఈ నలుగురిని నామినేట్‌ చేశారు. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎగువ సభకు 12 మందిని పంపించే అధికా రం రాష్ట్రపతికి ఉంది. ప్రధానంగా కళలు, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవ వంటి రంగాల్లో విశిష్టమైన సేవలందించిన వ్యక్తులకు రాష్ట్రపతి రాజ్యసభకు పంపిస్తుంటారు.  

న్యాయ పటిమకు మారుపేరు ఉజ్వల్‌ 
ఉజ్వల్‌ దేవ్‌రావు నికమ్‌కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో కోర్టులో ప్రభుత్వం పక్షాన వాదించారు. దాదాపు 100 మందికి శిక్షలు పడేలా కృషిచేశారు. ఆ తర్వాత 26/11 దాడి కేసులో ఉగ్రవాది కసబ్‌కు ఉరిశిక్ష పడేలా కీలక పాత్ర పోషించారు. ఎన్ని బెదిరింపులు వచి్చనా, ఎన్ని ఒత్తిళ్లున్నా పక్కాగా సాక్ష్యాధా రాలు సేకరించి, కోర్టులో వాదించడం ఉజ్వల్‌ నికమ్‌ ప్రత్యేకత. ఇప్పటివరకు వివిధ కేసుల్లో 628 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, 37 మందికి ఉరిశిక్ష పడేలా కోర్టులో వాదించారు. 2016లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్‌ సెంట్రల్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యరి్థగా ఉజ్వల్‌ పోటీ చేశారు.  

దౌత్య నిపుణుడు హర్షవర్ధన్‌ శ్రింగ్లా  
హర్షవర్ధన్‌ శ్రింగ్లా సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి. 1984 బ్యాచ్‌కు చెందిన ఆయన 38 ఏళ్లకు పైగా దౌత్య సేవలు అందించారు. అమెరికా, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్‌లో భారత రాయ బారిగా, హైకమిషనర్‌గా పని చేశారు. అమెరికా, చైనా వంటి దేశాలతో ఇండియా సంబంధాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2020 నుంచి 2022 వరకు భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా సేవలందించారు. 2023లో జీ20 కూటమికి భారత్‌ నా యకత్వం వహించిన సమయంలో జీ20 స మావేశాల ముఖ్య సమన్వయకర్తగా ఉన్నారు.

చరిత్రలో కొత్త వెలుగులు మీనాక్షి జైన్‌  
డాక్టర్‌ మీనాక్షి జైన్‌ విద్యావేత్తగా పేరుగాంచారు. చరిత్ర, సామాజిక శా్రస్తాల్లో లోతైన పరిశోధనలు చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలోని గార్గీ కాలేజీలో హిస్టరీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేశారు. భారతీయ నాగరికత, సంస్కృతిపై పలు పుస్తకాలను రచించారు.  విద్య, సాహిత్యం, చరిత్ర, రాజనీతిశాస్త్రంలో మీనాక్షి జైన్‌ సేవలు ప్రశంలందుకున్నాయి. పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.  

సాహసి సదానందన్‌ మాస్టర్‌  
కేరళలోని పాలక్కడ్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేత సి.సదానందన్‌ మాస్టర్‌ రాజకీయ హింసకు భయపడని వ్యక్తిగా ప్రఖ్యాతి చెందారు. పార్టీ మారేందుకు నిరాకరించినందుకు 1994 జనవరి 25న వామపక్ష కార్యకర్తలు ఆయనపై దాడి చేసి, రెండు కాళ్లను నరికేశారు. అయినా సదానంద్‌ మాస్టర్‌ ధైర్యం కోల్పోకుండా సమాజ సేవలో నిమగ్నమయ్యారు. విద్యా, సామాజిక రంగాల్లో తన వంతు సేవలందించారు. సుదీర్ఘకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2016, 2021లో  కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున కన్నూర్‌ నుంచి పోటీ చేశారు.  

మోదీ మరాఠీలో మాట్లాడారు  
ప్రధాని నరేంద్ర మోదీ తనతో మరాఠీ భాషలో మాట్లాడారని ఉజ్వల్‌ నికమ్‌ ఆదివారం తెలిపారు. తనను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేయబోతున్నట్లు ఆయన ముందే చెప్పారని అన్నారు. ‘‘శనివారం ప్రధాని మోదీ నాతో ఫోన్‌లో మాట్లాడారు. హిందీలో మాట్లాడాలా? లేక మరాఠీలో మాట్లాడాలా? అని అడి గారు. దాంతో ఇద్దరం కాసేపు హాయిగా నవ్వుకున్నాం. చివరకు మోదీ మరాఠీలోనే నాతో సరదాగా సంభాషించారు. రాజ్యసభకు పంపించబోతున్నట్లు చెప్పగా, అందుకు వెంటనే అంగీకారం తెలియజేశా’’ అని ఉజ్వల్‌నికమ్‌ వెల్లడించారు.  

అసాధారణ కృషి చేశారు: మోదీ  
రాజ్యసభకు నామినేట్‌ అయిన నలుగురు ప్రముఖులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారి నైపుణ్యం పార్లమెంట్‌ కార్య కలాపా లను సుసంపన్నం చేయాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీ సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. ‘‘నలుగురు ప్రముఖులు చేసిన కృషి అసాధారణం. న్యాయరంగం, రాజ్యాంగం పట్ల ఉజ్వల్‌ నికమ్‌ నిబద్ధత ప్రశంసనీయమైనది. ఆయనను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేయడం ఒక గౌరవ సూచిక. హర్షవర్దన్‌ శ్రింగ్లా ప్రతిభావంతుడైన దౌత్యవేత్త. వ్యూహాత్మక ఆలోచనలతో భారత్‌ను అంతర్జాతీయంగా నూతన శిఖరాలకు తీసుకెళ్లారు. సదానందన్‌ మాస్టర్‌ జీవితం ధైర్యసాహసాలకు ఒక ప్రతీక. విద్య, సమాజ సేవా రంగాల్లో ఆయన విశేషమైన కృషి సాగించారు. డాక్టర్‌ మీనాక్షి జైన్‌ ఒక గొప్ప చరిత్రకారిణి, విద్యావేత్త, పరిశోధనల్లో మేటి. ప్రతిభావంతురాలైన మీనాక్షి జైన్‌ రాజ్యసభకు వస్తుండడం చాలా సంతోషకరం’’ అని పేర్కొన్నారు.  

రాజ్యసభకు నామినేట్ అయిన కొత్త అభ్యర్థులు వీరే..

1. ఉజ్వల్ దేవరావు నికమ్‌: 26/11 ముంబై ఉగ్ర దాడులతో సహా అనేక ఉన్నత స్థాయి క్రిమినల్ కేసులను విచారించిన ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్.

2. సి. సదానందన్ మాస్తే: దశాబ్దాలుగా అట్టడుగు వర్గాలకు సేవలు అందిస్తున్న కేరళకు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త.

3. హర్షవర్ధన్ శ్రింగ్లా: భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, కీలక ప్రపంచస్థాయి పదవులలో పనిచేసిన అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త.

4. డాక్టర్ మీనాక్షి జైన్: ప్రముఖ  విద్యావేత్త, భారతీయ చారిత్రక విజ్ఞానానికి విశేష కృషి చేశారు.

న్యాయవాది, బీజేపీ నేత ఉజ్వల్ నికమ్‌ 1993 ముంబై వరుస పేలుళ్లు, 26/11 ఉగ్రదాడి తదితర కేసులలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఏ) కింద ఈ నామినేషన్లు దాఖలయ్యాయి. సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవ తదితర రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని రాజ్యసభకు నామినేట్ చేయడానికి రాష్ట్రపతికి ప్రత్యేక అధికారం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement