విజయ్‌(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా? | TVK Vijay victory may need Rs 42000 crore to fund poll promises in TN | Sakshi
Sakshi News home page

విజయ్‌(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా?

May 5 2026 3:53 PM | Updated on May 5 2026 4:04 PM

TVK Vijay victory may need Rs 42000 crore to fund poll promises in TN

సాక్షి, చెన్నై: తమిళనాట నటుడు, టీవీకే అధినేత విజయ్‌  సంచలనం విజయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన స్టార్‌ పవర్‌తోపాటు, ఆకర్షణీయమైన హామీలతో ప్రజలను ఆకట్టుకుని గెలుపు సాధించాడు.  కానీ ఇంతకుముందు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని  విజయ్‌ ముందు సవాళ్లు ఏంటి? పరిపాలన ఎంత విజయవంతంగా నిర్వహించగలడు? అనేది ప్రధాన చర్చ. అధికార పగ్గాలను చేపట్టిన తరువాత హామీలను నెరవేర్చడం తక్షణ ఆర్థిక సవాల్‌. విశ్లేషకుల అంచనాల ప్రకారం తొలి ఏడాదిలోనే అదనంగా రూ. 42,000 కోట్లు అవసరమవుతాయని అంచనాలు సూచిస్తున్నాయి.

విజయ్ ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయాలంటే మొదటి ఏడాదిలోనే సుమారు రూ. 42,000 కోట్ల అదనపు నిధులు అవసరమవుతాయని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక లోటు 2026-27 నాటికి రూ. 1.22 లక్షల కోట్లు (GSDPలో 3శాతం) ఉంటుందని అంచనా వేస్తున్న తరుణంలో ఇది పెద్ద సవాలుగా మారనుంది.

రూ. 42,000 కోట్ల అదనపు భారం
మహిళల సాయం, వృద్ధాప్య పెన్షన్లు, రైతు రుణమాఫీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వెనుకబడిన వర్గాల చదువు లాంటి హామీలను విజయ్‌ తన  మ్యానిఫెస్టోలో ప్రకటించారు. విజయ్ ప్రకటించిన హామీలు ప్రజలను ఆకట్టుకున్నప్పటికీ, వాటిని అమలు చేయడం అనేది కత్తి మీద సాము వంటిదే. ఈ హామీలను నెరవేర్చాలంటే రాష్ట్రం కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతారా? లేదా అప్పులు చేస్తారా అన్నది  తేలాల్సి ఉంది.  గ్రాడ్యుయేట్లకు రూ. 4,000, డిప్లొమా హోల్డర్లకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే దీనికి కఠిన నిబంధనలు అమలు చేస్తే ఆర్థిక భారం తక్కువగానే ఉండవచ్చని కూడా  భావిస్తున్నారు.

మరీ ముఖ్యంగా
ప్రధానంగా మహిళలకు నెలవారీ సహాయాన్ని రూ. 1,000 నుండి రూ. 2,500కి పెంపు. దీని వల్ల ఏటా అదనంగా రూ. 21,617 కోట్లు ఖర్చవుతుంది. దీనివల్ల మొత్తం వ్యయం రూ. 36,029 కోట్లకు చేరుతుంది.

వృద్ధాప్య పింఛన్‌ను రూ. 1,200 నుండి రూ. 3,000కి పెంచడం వల్ల రూ. 6,549 కోట్ల అదనపు భారం పడుతుంది. విడో పెన్షన్ల కోసం రూ. 1,829 కోట్లు, వికలాంగుల పెన్షన్ల కోసం రూ. 504 కోట్లు అదనంగా అవసరం. ఏడాదికి 6 ఉచిత LPG సిలిండర్ల హామీ వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 7,074 కోట్ల భారం పడుతుంది. ఇక రైతు భరోసా పథకం కింద  రైతులకు ఏడాదికి రూ. 15,000 సాయం కింద (కేంద్రం ఇచ్చే రూ. 6,000 కాకుండా) రాష్ట్రం అదనంగా రూ. 1,941 కోట్లు భరించాలి. అలాగు కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ కోసం మరో రూ. 382 కోట్లు అవసరం.

పరిమిత ప్రభావం
మరోవైపు కొన్ని పథకాల వల్ల ఆర్థిక భారం పరిమితంగా ఉండవచ్చని అంచనా. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న వివాహ పథకాల కింద సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 8 గ్రాముల బంగారం సహాయం అందిస్తోంది.  అంటే విజయ్‌ ప్రకటించిన పెళ్లిచేసుకునే యువతులకు ప్రకటించిన  8 గ్రాముల బంగారం, పట్టుచీర వల్ల అదనపు ఖర్చుల భారం పెద్దగా ఉండక పోవచ్చు.

ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా

ప్రతిపాదిత నిరుద్యోగ భృతి,గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4,000, డిప్లొమా హోల్డర్లకు రూ.3,000, కఠినమైన అర్హత నిబంధనలను కొనసాగిస్తే, ఆర్థిక వ్యవస్థపై పెద్దగా భారం పడకపోవచ్చు. కఠినమైన ఆదాయ పరిమితులతో ఉన్న ప్రస్తుత పథకానికి కేవలం రూ.2.37 కోట్ల వ్యయం మాత్రమే కాగా, దీనిని విస్తరించినా కూడా వ్యయం రూ.16 కోట్లలోపే ఉండవచ్చు.

తమిళనాడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే 
దేశ సగటు సామాజిక వ్యయం 42 శాతంగా ఉంటే, తమిళనాడులో ఇది 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం 34 శాతానికి పడి పోయింది. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ఖర్చు తగ్గుతూ వస్తోంది. రాష్ట్రం తన సొంత పన్ను రాబడి వ్యయాన్ని మెరుగు పరుచుకున్నప్పటికీ, దాని కట్టుదిట్టమైన వ్యయం (వేతనాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు) 35 శాతంతో జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉంది. 


 కాగా తమిళగ వెట్రి కజగం (టీవీకే) 2026 తమిళనాడు ఎన్నికలలో తొలిసారిగా ఘన విజయం సాధించింది. బూటకపు పార్టీ,  పొలిటికల్‌ డ్రామా ఆడుతున్న  సినిమా స్టార్‌ అన్న వెక్కిరింపులకు ధీటుగా రాష్ట్రంలోని 234 స్థానాలకు గాను 108 స్థానాలను కైవసం చేసుకుని విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే.
 

ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్‌ రహస్య ప్రేమ, వీకెండ్‌లో ఔటింగ్‌... కట్‌ చేస్తే!

Advertisement
 
Advertisement
Advertisement