ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా | West Bengal Rgkar victim mother BJP Ratna Debnath victory | Sakshi
Sakshi News home page

ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా

May 5 2026 11:47 AM | Updated on May 5 2026 12:50 PM

West Bengal Rgkar victim mother BJP Ratna Debnath victory

పశ్చిమ బెంగాల్లో సంచలనం రేపిన ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీ ఘటన బాధితురాలి తల్లి, బీజేపీ అభ్యర్థి రత్న దేబ్‌నాథ్ (Ratna Debnath) అద్భుత విజయాన్ని సాధించారు. కన్నబిడ్డను అత్యంత దారుణ పరిస్థితుల్లో  కోల్పోయిన ఆమె తన తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీలోకి అడుగుపెట్ట బోతున్నారు. న్యాయకోసం సాగిన పోరులో జనం ఆమెకు అండగా నిలబడ్డారు. దీంతో పానిహాటిలో రత్నమ్మ అఖండ విజయాన్ని అందుకున్నారు. కన్నీటి గాథ నుంచి విజయ తీరాలకు చేరిన ఆమె ప్రస్థానం బెంగాల్‌ గడ్డపై ప్రత్యేకంగా నిలుస్తుంది.  

2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో  పానిహాటి అసెంబ్లీ నియోజకవర్గం  నుంచి BJP అభ్యర్థిగా పోటీ చేసిన  రత్నా దేబ్‌నాథ్‌  28 వేలకు పైగా  ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదీ అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న  TMC అభ్యర్థి తీర్థంకర్ ఘోష్‌పై గెలవడం  విశేషం.  అయితే ఆమె పొలిటిక్‌ ఎంట్రీ మాత్రం ఒక విషాదం తరువాత జరిగింది. కానీ తనబిడ్డకు జరిగిన అన్యాయంపై పోరుచేసి విజయాన్ని అందుకున్న అమ్మగా ఆమె చరిత్రలో నిలిచిపోతారు.

ఆమె పొలిటికల్‌ ఎంట్రీ
2024 ఆగస్టులో తన కుమార్తెపై జరిగిన అమానుష ఘటన తర్వాత,తన కుమార్తెకున్యాయం జరగాలనే డిమాండ్‌తో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.  మహిళల రక్షణ , జవాబుదారీతనం ప్రధాన ఎజెండాగా ఆమె ప్రచారం నిర్వహించారు. న్యాయం కోసం జరిగిన పోరాటానికి ప్రజలు పట్టం కట్టారని, బాధితురాలి తల్లి విజయం అత్యంత కీలకమైనదని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా ఆగస్టు 9 న నార్త్ కోల్‌కతాలోని ఆర్జీ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. వైద్యురాలిపై ఆస్పత్రిలోనే అతికిరాతంగా అత్యాచారం చేసి హతమార్చిన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అప్పటి మమతా సర్కార్‌ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. పెద్ద ఎత్తు నిరసనలు చెలరేగాయి. నిరసనల వెనుక బీజేపీ, సీపీఐ(ఎం) కుట్రలు ఉన్నాయని, రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం, ఉద్యమకారులపై దాడి చేయించడం, సాక్ష్యాలను నాశనం చేయడం, పోలీసులు, ఇతర అధికారులు తీరును సమర్ధించడంపై ఆగ్రహం పెల్లుబుకింది. ఒక విధంగా ఈ ఘటనలో నేరస్తులకు వత్తాసు పలకడమే అటు మమతా బెనర్జీకి, ఇటు టీఎంసీ పతనానికి పునాది వేసిందని విశ్లేషకుల అంచనా.

రేఖా పాత్ర
మరోవైపు 2024 ప్రారంభంలో బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో TMC నేతలు షాజహాన్ షేక్, అతని అనుచరులు, భూములను లాక్కున్నారని , మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలతో గ్రామీణ మహిళలు, ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందినవారు, నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు. వీరిపైనా కూడా దీదీ ఉక్కుపాదం మోపారు. ఈ సందేశ్‌ఖాలీ నిరసనల్లో కీలక ముఖచిత్రంగా నిలిచిన రేఖా పాత్ర కూడా బీజేపీ తరపున హింగల్‌గంజ్ నుంచి విజయం సాధించారు. ఆమె 5,421 ఓట్ల మెజారిటీతో తృణమూల్ అభ్యర్థి ఆనంద సర్కార్‌ను ఓడించారు. గతంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, ఈసారి హింగల్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

కాగా బీజేపీ  బెంగాల్‌లో  294 స్థానాలకు గాను 202 స్థానాలను కైవసం చేసుకుంది.  భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిజెపి నేత సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ విజయంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల సుదీర్ఘ పాలన ముగిసింది.

ఇదీ చదవండి: బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనంలో ఈమె చాలా స్పెషల్‌

Advertisement
 
Advertisement
Advertisement