టాటా చేతికి నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణ కాంట్రాక్టు

Tatas To Bag New Parliament Building Contract - Sakshi

రూ . 861.90 కోట్ల బిడ్‌తో టాటా వశం

సాక్షి, న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా దక్కించుకుంది. ఆర్థిక బిడ్స్‌లో బుధవారం ఎల్‌అండ్‌టీతో పోటీ పడి టాటా ప్రాజెక్ట్స్‌ పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణ కాంట్రాక్టును చేజిక్కించుకుంది. ఈ ప్రాజెక్టును 861.90 కోట్ల రూపాయలతో పూర్తి చేయనున్నట్టు టాటా ప్రాజెక్ట్‌ పేర్కొంది. నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణానికి ఎల్‌అండ్‌టీ దాఖలు చేసిన రూ .865 కోట్ల కంటే తక్కువ మొత్తం దాఖలు చేసి టాటా గ్రూప్‌ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మాణాన్ని దక్కించుకుంది. నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రజా పనుల శాఖ ఈ రోజు ఆర్థిక వేలం నిర్వహించింది. కాగా, పార్లమెంట్ భవన నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేయనున్నట్లు సమాచారం. త్రిభుజాకారంలో నిర్మించనున్న ఈ భవనానికి మొత్తంగా 940 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వ ప్రజా పనుల శాఖ అంచనా వేసింది.

బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన ప్రస్తుత భవనానికి మరమ్మత్తులు చేసిన అనంతరం ఇతర అవసరాల కోసం వినియోగించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది ఆరంభంలోనే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులు త్రిభుజాకార భవనంగా దీన్ని నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్టు సమాచారం. నూతన పార్లమెంట్‌ భవనంపై భారత జాతీయ చిహ్నం ముద్రిస్తారని తెలిసింది. పార్లమెంట్‌ హౌస్‌ ఎస్టేట్‌లోని 118వ నెంబర్‌ ప్లాట్‌లో 60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నూతన భవనం కొలువుతీరనుంది. సెంట్రల్‌ విస్టా రీడెవలప్‌మెంట్‌లో భాగంగా తొలి ప్రాజెక్టుగా పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. చదవండి : ప్రశ్నోత్తరాల రద్దుపై విపక్షాల ఆందోళన

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top