తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే టీవీకే అధినేత విజయ్ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే వస్తుంది. కానీ ఈసారి ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా.. మొత్తం ఖర్చును పార్టీ నిధుల నుంచే భరించాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలోనే ఈ తరహా నిర్ణయం ఇదే తొలి కావడం గమనార్హం!
రేపో లేదంటే ఎల్లుండో విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది. ఐదు వేల మంది హాజరయ్యేలా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని టీవీకే భావిస్తోంది. తమిళనాడు లోక్‌భవన్ (గవర్నర్ కార్యాలయం) ప్రకటన ప్రకారం.. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ సాయంత్రం ప్రకటించబడతాయి. అయితే ఈ ఏర్పాట్లను ప్రభుత్వం కాకుండా టీవీకే పార్టీ స్వయంగా నిర్వహిస్తోందని లోక్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి.
సీఎం ప్రమాణ స్వీకార వేడుక అంటే.. ముఖ్యమైన ప్రజాస్వామ్య కార్యక్రమం. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రజల ముందు రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేస్తారు. గవర్నర్ సమక్షంలో ఈ వేడుక జరగుతుంది. కాబట్టి ప్రజలు పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మునే ఖర్చు చేస్తారు. సాధారణ పరిపాలన శాఖ (General Administration Department) ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. టెంట్‌లు, స్టేజ్, సౌండ్ సిస్టమ్, లైటింగ్, అతిథుల స్వాగతం వంటి అన్ని అంశాలకు ఖర్చు లెక్కలు ఈ శాఖే చూసుకుంటుంది. అలాగే..
ఖర్చు స్థాయి కార్యక్రమం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. సాదాసీదా ప్రమాణ స్వీకారం రాజభవన్‌లో జరిగితే ఖర్చు తక్కువగా ఉంటుంది. కానీ భారీ సభలు స్టేడియం లేదంటే పెద్ద మైదానంలో నిర్వహిస్తే ఖర్చు కోట్లలోకి వెళ్తుంది. ప్రజలకు విస్తృతంగా హాజరు అవకాశం కల్పిస్తే ఖర్చు మరింత పెరుగుతుంది. వీటికి తోడు..
ఈ కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లు అత్యంత కీలకం. వేలాది పోలీసు సిబ్బంది, ఇతర దళాలు నియమించబడతాయి. వాళ్ల ప్రయాణం, భోజనం, లాజిస్టిక్స్ అన్నీ ప్రభుత్వ నిధుల నుంచే వస్తాయి. అదనంగా, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు.. పెద్ద టెంట్‌లు, వేదికలు, కూర్చోవడానికి సౌకర్యాలు కూడా ఖర్చులో ప్రధాన భాగం. గవర్నర్, ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు.. ముఖ్య అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే ఆ ఖర్చు మరింత పెరిగిపోతుంది కూడా.
అధికారిక ప్రభుత్వ కార్యక్రమం కావడంతో.. ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ప్రైవేట్ డొనేషన్లు లేదంటే వ్యక్తిగత నిధులు ఇందులో భాగం కావు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా.. ప్రజల పన్నుల ద్వారా సమకూరిన నిధులు ఈ వేడుకకు వినియోగించబడతాయి. అయితే విజయ్ మాత్రం ప్రభుత్వ ఖర్చు లేకుండా.. టీవీకే పార్టీ నిధులతోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. ఇందుకు గవర్నర్ కూడా అంగీకరించినట్లు లోక్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రానికి ఈ విషయం మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానా మీద భారాన్ని తగ్గిస్తూ, పార్టీ నిధులతోనే ఈ వేడుకను నిర్వహించాలని విజయ్ భావించడం.. ప్రజాస్వామ్యానికి, ప్రజల పన్నుల వినియోగానికి గౌరవం చూపినట్టేనన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది.


