దక్షిణాదిలోని మూడురాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత దేవదాయ చట్టాల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు విచారణ
హైకోర్టులను ఆశ్రయించాలన్న గత ఆదేశాల ఉపసంహరణ
మెరిట్స్ ఆధారంగా తామే విచారిస్తామని ధర్మాసనం స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: హిందూ దేవాలయాలపై రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలోని దేవదాయ చట్టాల రాజ్యాంగ చెల్లుబాటును దేశ అత్యున్నత న్యాయస్థానంలోనే తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పిటిషనర్లు ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆశ్రయించాలంటూ గత ఏడాది ఏప్రిల్‌లో తాము ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంది. దేవదాయ సంస్థల నిర్వహణ వ్యవహారాల్లో ప్రభుత్వాల జోక్యాన్ని సవాల్ చేస్తూ 2012లో సుప్రీంకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
ఈ చట్టాల్లోని నిబంధనలపై విచారణ జరిపిన జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం గత ఏడాది ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్కో రాష్ట్ర చట్టం ఒక్కో రకంగా ఉండే అవకాశం ఉన్నందున స్థానిక సామాజిక, మతపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా రాష్ట్రాల హైకోర్టులే ఈ పిటిషన్లను విచారించడం సబబుగా ఉంటుందని అప్పట్లో వ్యాఖ్యానించింది. ఆయా హైకోర్టులే అవసరమైతే నిపుణుల కమిటీని వేసుకోవచ్చని సూచించింది.
ఉమ్మడి మద్రాసు రాష్ట్ర చట్టాల ఆధారంగానే ఈ చట్టాలు
సుప్రీంకోర్టు పాత ఆదేశాలపై పిటిషనర్లు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై తాజాగా ఓపెన్ కోర్టులో విచారణ జరిగింది. దక్షిణాది రాష్ట్రాల దేవదాయ చట్టాలు వేర్వేరుగా ఉన్నాయన్న అంచనాతో కోర్టు గత ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్ల న్యాయవాదులు వాదించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర చట్టాల ఆధారంగానే ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి చట్టాలు రూపొందాయని, వీటిలో నిబంధనలన్నీ ఒకేలా ఉన్నాయని వివరించారు.
13 ఏళ్లుగా ఇక్కడ పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవహారాన్ని ఇప్పుడు హైకోర్టులకు బదిలీ చేయడం వల్ల ఒకే అంశంపై అనేక విచారణలు జరిగి, పిటిషనర్లకు ఇబ్బందులు ఎదురవుతాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆలయ నిధుల మళ్లింపు, ఈవోల నియామకం వంటి నిబంధనలు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. పిటిషనర్ల వాదన, కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం రివ్యూ పిటిషన్లను అనుమతించింది.
దక్షిణాది రాష్ట్రాల దేవదాయ చట్టాలపై పిటిషనర్లు హైకోర్టులకు వెళ్లాలని సూచిస్తూ 2025 ఏప్రిల్‌లో తామిచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ చట్టాలకు సంబంధించిన పిటిషన్లన్నింటినీ అత్యున్నత న్యాయస్థానంలోనే మెరిట్స్ ఆధారంగా విచారిస్తామని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కీలక వ్యవహారంపై సుప్రీంకోర్టులోనే తుది విచారణ జరగనుంది.


