న్యూఢిల్లీ: మూకదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జమియత్ ఉలేమా–ఇ–హింద్ వేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాలంటూ పిటిషనర్‌ను అలహాబాద్ హైకోర్టు ఆదేశించడాన్ని సమర్థించింది. దీనిపై తాము జోక్యం చేసుకోజాలమని స్పష్టం చేసింది.
తెహ్సీన్ పూనావాలా కేసులో అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని జమియత్ ఉలేమా–ఇ– హింద్ తదితర పిటిషనర్లు తెలిపారు. అయితే, జమియాత్ ఉలేమా తదితరులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను దాఖలు చేయ డంపై అలహాబాద్ హైకోర్టు జూలై 15వ తేదీన చేపట్టిన విచారణ సందర్భంగా తప్పు బట్టింది. మూకదాడి ప్రత్యేకమైన ఘటన అయినందున పిల్‌గా స్వీకరించలేమని తెలిపింది. అయితే, అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన మార్గదర్శకాల అమలు గురించి బాధితులు సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆశ్రయించవచ్చని సూచించింది.


