సీబీఐ ఛీఫ్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్ | Sakshi
Sakshi News home page

సీబీఐ ఛీఫ్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్

Published Tue, May 25 2021 11:14 PM

 Subodh Kumar Jaiswal Maharashtra IPS Officer Is New CBI Director  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 1985వ బ్యాచ్‌కు చెందిన  జైస్వాల్‌ ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐ ఎన్వీ రమణ, లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరిలతో కూడిన హైపవర్‌ కమిటీ సోమవారం ప్రధాని నివాసంలో సమావేశమై ముగ్గురి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసింది.

ఈ జాబితాలో సీఐఎస్‌ఎఫ్‌ చీఫ్‌ సుబోధ్‌  జైస్వాల్, ఎస్‌ఎస్‌బీ డీజీ కేఆర్‌ చంద్ర, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి వీఎస్‌కే కౌముది పేర్లు ఉన్నట్లు తెలిసింది. వీరిలో సీనియర్‌ అయిన  జైస్వాల్‌ను సీబీఐ డైరెక్టరుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. జైస్వాల్‌ మహారాష్ట్ర డీజీపీగా పనిచేశారు. ముంబై కమిషనర్‌గానూ, ‘రా’లో తొమ్మిదేళ్లు పనిచేశారు. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న రిషి కుమార్‌ శుక్లా ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన పదవీవిరమణ చేశారు. అప్పటినుంచి అదనపు డైరెక్టర్‌ ప్రవీణ్‌ సిన్హా తాత్కాలిక డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఆరునెలల లోపు పదవీ కాలం ఉంటే వద్దు: సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ
ఆరు నెలల లోపు పదవీకాలం ఉంటే ఆయా అధికారులను పోలీస్‌ బాస్‌లుగా నియమించొద్దని ప్రధాని నరేంద్ర మోదీకి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ సూచించినట్లు సమాచారం. సీబీఐ చీఫ్‌ నియామకానికి సంబంధించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌రంజన్‌ చౌధరి, సీజేఐ ఎన్వీ  రమణలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉదహరించినట్లు తెలిసింది.

పదవీ విరమణకు ఆరునెలల లోపు సమయం ఉన్న వారిని పోలీస్‌ చీఫ్‌లుగా నియమించొద్దని రాష్ట్ర డీజీపీల నియామకం విషయంలో మార్చి 2019లో ప్రకాశ్‌సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిందని సీజేఐ గుర్తుచేశారు. అలాగే వినీత్‌ నారాయణ్‌ తదిరుల కేసులో సీబీఐ చీఫ్‌ నియామకంలోనూ సుప్రీంకోర్టు ఇచి్చన మార్గదర్శకాలు ఇదే చెబుతున్నాయని తెలిపారు. అదే విధంగా సీవీసీ, లోక్‌పాల్‌ చట్టాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వివరించినట్లు తెలిసింది.

ఇదే తీర్పును ఐబీ, రా (రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) చీఫ్‌ నియామకాలకు వర్తింపజేయాలని జస్టిస్‌ రమణ సూచన చేసినట్లు సమాచారం. జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ విధంగా సూచన చేయడంతో సీబీఐ చీఫ్‌ రేసులో 1984 బ్యాచ్‌కు చెందిన అస్సాం–మేఘాలయ కేడర్‌ ఐపీఎస్‌ వైసీ మోదీ, గుజరాత్‌ కేడర్‌కు చెందిన రాకేశ్‌ అస్థానాలకు దారులు మూసుకుపోయాయి.

ఈ సమయంలో అధిర్‌ రంజన్‌ చౌదరి జస్టిస్‌ ఎన్వీ రమణకు మద్దతుగా సీబీఐ చీఫ్‌ ఎంపిక ప్రక్రియలో ‘రూల్‌ ఆఫ్‌ లా’ను అనుసరించాలని కోరినట్లు తెలిసింది. వైసీ మోదీ ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చీఫ్‌గా, ఆస్థానా బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌గా ఉన్నారు. సీబీఐ చీఫ్‌ రేసులో ముందువరసలో ఉన్నప్పటికీ వీరిద్దరూ జులైలో పదవీ విరమణ పొందనున్నారు. దాంతో కేంద్ర ప్రభుత్వం వీరి పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు.

సుబోధ్‌ ప్రస్థానం
►సుబోధ్‌   జైస్వాల్‌ 1962 సెప్టెంబర్‌ 22న జన్మించారు. 
►బీఏ (హానర్స్‌), ఎంబీఏ చేశారు. 
►1985 బ్యాచ్‌కు చెందిన మహారాష్ట్ర కేడర్‌ ఐపీఎస్‌ అధికారి.
 
►ముంబై యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌లో పనిచేశారు. పలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. 2008లో జరిగిన మాలేగావ్‌ పేలుళ్ల కేసును దర్యాప్తు చేశారు.

►2002లో నకిలీ స్టాంపు పేపర్‌ల కుంభకోణంపై దర్యాప్తు జరిపిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)కు నేతృత్వం వహించారు. అబ్దుల్‌ కరీమ్‌ తెల్గీ ప్రధాన పాత్రధారిగా తేలిన రూ. 20 వేల కోట్ల రూపాయల స్టాంపు పేపర్ల కుంభకోణం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.  

►జులై 11, 2006లో చోటుచేసుకున్న వరుస రైలు బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో కీలకపాత్ర పోషించారు. 
►ముంబై పోలీసు కమీషనర్‌గా పనిచేశారు.  

►మహారాష్ట్ర డీజీపీగా 2019 ఫిబ్రవరిలో నియమితులయ్యారు. పనిచేస్తున్న స్థానాల్లో రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకోకుండానే ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వంతో ఆయనకు విబేధాలు వచ్చాయి.  

►ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)లో సేవలందించారు. 
►రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా)లో తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలం సేవలందించారు. ఇందులో మూడేళ్లు రా అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 

►విధినిర్వహణలో ప్రతిభ చూపినందుకుగాను 2001లో రాష్ట్రపతి పోలీసు మెడల్‌ను అందుకున్నారు. 
►2020లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అసాధారణ్‌ సురక్షా సేవా ప్రమాణ్‌ పత్ర్‌ (ఏఎస్‌ఎస్‌పీపీ) అందుకున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement