కరోనా టీకాతో గర్భంలోని మాయకు నష్టం లేదు

Study Says COVID Vaccine Does Not Damage The Placenta In Pregnant Women - Sakshi

గర్భిణులు నిరభ్యంతరంగా టీకా తీసుకోవచ్చు

అమెరికా వర్సిటీ అధ్యయనం

న్యూఢిల్లీ: కరోనా టీకాపై ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. ప్రధానంగా గర్భిణులు ఈ టీకా తీసుకోవచ్చా? లేదా? అనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్‌తో గర్భానికి ఎలాంటి నష్టం వాటిల్లదని అమెరికా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. గర్భంలోని మాయకు (ప్లాసెంటా) ఏమాత్రం ఇబ్బంది ఉండదని, అనుమానాలు అక్కర్లేదని వెల్లడించింది.  ఈ వివరాలను అబ్స్‌టేట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురించారు. ‘ప్లాసెంటా అనేది విమానంలోని బ్లాక్‌బాక్స్‌ లాంటిది. గర్భంలో ఏవైనా పొరపాట్లు జరిగితే మాయలో మార్పులను గమనించవచ్చు. తద్వారా అసలేం జరిగిందో కనిపెట్టవచ్చు’ అని అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్సిటీ ఫీన్‌బర్గ్‌ స్కూల్‌ మెడిసిన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జెఫ్రీ గోల్ట్‌స్టీన్‌ చెప్పారు.

కోవిడ్‌ టీకా ప్లాసెంటాను దెబ్బతీయదని అన్నారు. గర్భిణులు నిరభ్యంతరంగా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని సూచించారు. తమ అధ్యయనం గర్భిణుల్లో కరోనా వ్యాక్సిన్ల పట్ల భయాందోళనలను దూరం చేస్తుందని భావిస్తున్నట్లు పరిశోధకుడు ఎమిలీ మిల్లర్‌ చెప్పారు. అధ్యయనంలో భాగంగా 84 మంది కరోనా టీకా (మోడెర్నా లేదా ఫైజర్‌ టీకా) తీసుకున్న గర్భిణులు, 116 మంది టీకా కోసం తీసుకోని గర్భిణుల్లోని ప్లాసెంటాను పరిశీలించారు. టీకా తీసుకున్న గర్భిణుల్లో ప్రతిరక్షకాలు (యాంటీ బాడీలు) వృద్ధి చెంది, మాయలోని పిండానికి కూడా బదిలీ అయినట్లు గుర్తించారు.

అంటే కరోనా టీకాతో మాయలోని పిండానికి కూడా పూర్తి రక్షణ కలుగుతున్నట్లు నిర్ణయానికొచ్చారు. ఇక గర్భంతో ఉన్నప్పుడు కరోనా వైరస్‌ సోకితే తల్లికి, గర్భంలోని బిడ్డకు మధ్య అసా«ధారణంగా రక్తప్రసారం జరుగుతున్నట్లు గమనించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందితే, రక్తప్రసారం సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు తేల్చారు. కరోనా వ్యాక్సిన్‌తో తల్లికి, బిడ్డకు.. ఇద్దరికీ రక్షణే. సురక్షితమైన గర్భానికి వ్యాక్సిన్‌ దోహదపడుతోందని సైంటిస్టులు చెబుతున్నారు.

(చదవండి: మీ వద్ద కరోనా మందులు ఉన్నాయా.. మేము తీసుకుంటాం!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top