ప్రాణం మీదకొస్తున్న ‘ప్యాకేజీ’ చదువులు!

A story On Kota College Issue students With mental issues  - Sakshi

చదువు.. తెలివి
ముందుగా ‘ప్యాకేజీ ’ చదువుల ఇంజనీర్‌ కథ ..

ఓ వ్యక్తి బాగా చదువుకున్నాడు. ఇంజనీర్‌ అయ్యాడు. బాగా సంపాదిస్తున్నాడు. కారు కొనుక్కున్నాడు. డ్రైవర్‌ను కూడా పెట్టుకున్నాడు.  ఫంక్షన్‌ ఉండడంతో ఓ రోజు  ఊరెళ్లాల్సి వచ్చింది. కానీ, డ్రైవర్‌ సెలవు పెట్టాడు. దానితో తనే స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ ఊరికి బయలు దేరాడు. దాదాపుగా ఊరిదాకా వెళ్లాడు. కానీ అంతలోనే కారు టైరు పంక్చరయ్యింది. మార్చడానికి ఎప్పటిలా డ్రైవర్‌ లేడు. చేసేదేంలేక తానే టైర్‌ మార్చే ప్రయత్నం చేయసాగాడు. కష్టపడి టైర్‌ విప్పాడు. దురదృష్టం మనవాడిని వెన్నాడుతూనే ఉంది.  స్టెప్నీ టైర్‌ తీసిపెట్టి బిగించే టైమ్‌లో కాలు తాకి విప్పిపెట్టిన నట్లు పక్కనే ఉన్న మురికి కాల్వలో పడ్డాయి. ఉసూరుమన్నాడు.  దిగి తీద్దామంటే బురద... అంటితే ఫంక్షన్‌కు అటెండ్‌ కావడం ఎలా? కర్రలు గట్రాలతో రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఏదీ వర్కవుట్‌ కాలేదు... తలపట్టుకుని అలాగే కూర్చున్నాడు. అరగంట గడిచింది. ఆ దారిలో పశువులను తోలుకుంటూ ఓ ఆసామి వస్తున్నాడు అతన్ని పిలిచి తన బాధంతా చెప్పి ఎలాగైనా ఆ న ట్లు తీసివ్వాలని  రిక్వెస్ట్‌ చేశాడు. దానికి ఎంత డబ్బయినా ఇస్తానని చెప్పాడు. కొంచెంసేపు ఆ ఇంజనీర్‌వైపు కారువైపు అలాగే చూసి నవ్వుతూ ఇలా అన్నాడు.
‘‘బాబూ!, డబ్బుల విషయం అలా ఉంచు. నేను దిగి తీసివ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు. కానీ, అందులో దిగాకా నేను మళ్లీ ఇంటికి వెళ్లి బురద కడుక్కుని రావాలి. నువ్వు కూడా దానిలో దిగలేవు. అందుకని నేనో ఉపాయం చెబుతా.. మిగతా  చక్రాలవి ఒక్కో నట్టు తీసి ఈ టైరుకు బిగిద్దాం. కారు నడవడానికి ఢోకా ఉండదు. నువ్వు హాయిగా వెళ్లొచ్చు. ఓ పది కిలోమీటర్ల దూరంలో మెకానిక్‌ షాపు ఉంది. అక్కడకి వెళ్లి  నట్లు వేయించుకుని వెళ్లు. నీకు డబ్బు ఖర్చు, నాకు బురదా తప్పుతాయి.

ఆ ఐడియాకు ఆ మెకానికల్‌  ఇంజనీర్‌ అవాక్కయ్యాడు. ఈ మాత్రం ఆలోచన రాక అరగంట నుంచి  ఇబ్బంది పడ్డానే అనుకున్నాడు.. చదువు మెకానికల్‌ అయిపోయి, ఉద్యోగానికి మాత్రమే, అందునా ప్యాకేజీలకు మాత్రమే పనికి వచ్చే చదువుతో తయారైన బుర్ర నుంచి ఇలాంటి పదునైన ఆలోచన రావడం కష్టమే..చావుల చదువు.. ఓ సీలింగ్‌ ఫ్యాన్‌.. మేధో బుర్రలకు తట్టిన గొప్ప ఐడియా. సీలింగ్‌ ఫ్యాన్‌కు దానికి ఆధారంగా ఉండే రాడ్‌కు మధ్య ఓ స్ప్రింగ్‌ను బిగిస్తారు. ఈ ఫ్యాన్లకు 20 కిలోల కన్నా ఎక్కువ బరువు వేలాడితే వెంటనే స్ప్రింగ్‌  సాగుతుంది. దానితో ఫ్యాను సీలింగ్‌ నుంచి కిందకు దిగుతుంది. స్ప్రింగ్‌ సాగగానే సైరన్‌కూడా మోగుతుంది. 

అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే ఇవి ఇప్పుడు రాజస్థాన్‌లోని కోటా పట్టణంలోని హాస్టళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. కోటాలోని ఐఐటీ కోచింగ్‌ సెంటర్లలో చదివే విద్యార్థులు ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారని.. వాటిని ఆపాలని ప్రయత్నం. వీటితో పాటు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకోకుండా భవనాల వెలుపలా, బాల్కనీల్లో సూసైడ్‌ ప్రూఫ్‌ వలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి 150  కిలోల బరువు మోయగలవు.  ఎవరైనా విద్యార్థులు భవనంపై నుంచి దూకినా గాయాలు కావు. పరిష్కారం ఇదేనా.. అన్న చర్చ పక్కన పెడితే..

విద్యావ్యవస్థ సిగ్గు పడాల్సిన సందర్భం ఇది. 

చదువు ఏమి ఇస్తది..

జ్ఞానం ఇస్తది..

 బతుకుకు భరోసా ఇస్తది. చావు నిస్తదా..

చదువు ఎంత గొప్పదయితే అంత చావునిస్తదా.

చదువు ఎందుకంత గొప్పదయ్యింది. మంచి జ్ఞానాన్ని, జీవితంపై భరోసాను కాదు మంచి జీతాన్ని ఇస్తదని, మంచి ప్యాకేజీలను ఇస్తదని ఆశ.. దానివల్ల విద్యార్థులపై ఒత్తిడి. పదిహేను లక్షలమందితో పోటీపడి 12 వేల మంది గెలుచుకునే క్రీడ. ఇందులో బలయ్యేది.. ఎక్కువగా తక్కువ స్థోమత ఉన్న కుటుంబంలోంచి వచ్చిన పిల్లలేనట.  ఉన్న ఎకరమో, అరెకరమో అమ్మి, లేదా ఆర్థిక స్థోమత లేక అప్పోసప్పో చేసి తల్లిదండ్రులు పిల్లల బాగుకోసం చదువులకు పంపితే..అది ఇంకా పిల్లలపై ఒత్తిడి పెంచుతోంది. అసలే తీవ్రమైన పోటీ.. ఎడ తెరిపిలేకుండా శిక్షణ, ఆ చదువులు అబ్బుతాయా లేదా అన్న విచక్షణ లేకుండా.. మంచి ప్యాకేజీలో స్థిరపడాలన్న తల్లిదండ్రుల ఆకాంక్ష,, వెరసి చదువులు స్ప్రింగ్‌ ఫ్యాన్లు, సూసైడ్‌ ప్రూఫ్‌ నెట్‌ దాకా వచ్చాయి.
....
ఇంతా కష్టపడి చదివిన ఐఐటీ డిగ్రీలు అవి నేర్పిన వృత్తిలోనే స్థిర పడుతున్నారా... ఏది దొరికితే ఆ ఉద్యోగం చేస్తున్నారు.. మనం పైన సరదాగా చెప్పుకున్న మెకానికల్, ప్యాకేజీ చదువులయిపోయాయి. మనసుకు పట్టినా పట్టకపోయినా.. మెకానికల్‌గా చదువుకుని బయటపడ్డవాళ్లు బతికిపోతున్నారు.. లేని వాళ్లు చితికి పోతున్నారు. 
చదవేస్తే...
తెల్లారితే చాలు.. ఎక్కడో ఓ చోట.. ఎవరో 
ఓ విద్యార్థి ఆత్మహత్య వార్త వింటున్నాం. 

చదువుల ఒత్తిడి.. పరీక్షల్లో పాస్‌ కాకపోతే ఎలాగనే ఆవేదన.. తల్లిదండ్రులు, స్నేహితుల ముందు పరువుపోతుందనే ఆందోళన.. విద్యా సంస్థల్లో అధ్యాపకులు, సిబ్బంది వేధింపులు.. ఇలాంటివన్నీ కలసి విద్యార్థుల ఆత్మ‘హత్య’లకు కారణమవుతున్నాయి. కుటుంబ, వ్యక్తిగత కారణాలూ వీటికి తోడవుతున్నాయి. 
కొన్నేళ్లుగా ఈ సమస్య మరింతగా పెరుగుతూ వస్తోంది. జూనియర్‌ కాలేజీల నుంచి మొదలుకుని మెడికల్‌ కాలేజీలు, ప్రఖ్యాత ఐఐటీల వరకు అన్నిచోట్లా విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతున్నాయి. 

  • దేశంలో 2017– 2021 మధ్య ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయి. అదే ఒక్క విద్యార్థులనే పరిగణనలోకి తీసుకుంటే 32 శాతం పెరిగాయి. 
  • 2017లో 9,905 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడితే.. 2021లో ఈ సంఖ్య 13 వేలకుపైనే. దేశంలో సగటున రోజుకు 35 మంది..  అంటే ప్రతి రెండు గంటల్లో ముగ్గురు  విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.  ఇందులోనూ పురుష విద్యార్థుల బలవన్మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి.
  • కరోనా మహమ్మారి కారణంగా 2020లో విద్యార్థుల ఆత్మహత్యల్లో ఒక్కసారిగా 21శాతం పెరుగుదల నమోదైనట్టు గుర్తించారు. దేశంలోనే టాప్‌ విద్యాసంస్థలు అయిన ఐఐటీలు, ఐఐఎంలు, నిట్‌లు, సెంట్రల్‌ యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి. 2018 నుంచి 2023 ఏప్రిల్‌ మధ్య వీటిలో 103 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
  • ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,  తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతుంటే.. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, తెలుగు రాష్ట్రాల్లో  పెరుగుతూ వస్తున్నాయి. 
  • వయసుపరంగా చూస్తే.. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వారి ఆత్మహత్యలు బాగా పెరిగాయి. ఈ ఏజ్‌వారు 2017  కల్లా 45,217 మంది బలవన్మరణానికి పాల్పడగా.. 2021 నాటికి ఈ సంఖ్య 56,543కు చేరుకుంది.
  • అయితే విద్యార్థులు స్కూల్‌ చదువు పూర్తిచేసి కాలేజీల్లో చేరినప్పుడు.. ఒక్కసారిగా మారిపోతున్న విద్యా వాతావరణం, కాలేజీ చదువుకు అయ్యే ఖర్చు, విద్యార్థుల సామాజిక–సాంస్కృతిక–ఆర్థిక స్థాయిల్లో భేదాలతో ఒత్తిడి వంటివి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇవి వారి కుటుంబాల్లో సమస్యలకు కారణమై.. ‘కుటుంబ సమస్యల’తో బలవన్మరణాలు జరుగుతున్నాయని అంటున్నారు.
  • జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన ‘భారత్‌లో ప్రమాద మరణాలు, ఆత్మహత్యల నివేదిక (ఏడీఎస్‌ఐ)’లోని అధికారిక లెక్కలే ఇవి. ఇంకా నమోదుకాని ఆత్మహత్యలు మరెన్నో.

సరికొత్త చలపతి, రచయిత

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top