
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపటి(సోమవారం, సెప్టెంబర్ 15వ తేదీ) నుంచి ఉన్నత విద్యాసంస్థలను బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్ అసోసియేషన్ వెల్లడించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి విద్యార్థులు ఎవరూ కాలేజీలకు రావొద్దని పిలుపునిచ్చింది.
డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, నర్సింగ్ సహా అన్ని కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. టెన్త్ తర్వాత ఉన్న అన్ని కళాశాలల విద్యార్థుల తరగతులకు రావొద్దని పేర్కొంది. అదే సమయంలో రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలను సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీనిలో భాగంగా పరీక్షలను వాయిదా వేయాలని వర్సిటీలను కోరినట్లు తెలిపింది. విద్యార్థులు రేపటి నుంచి కళాశాలకు రావొద్దని, వాటికి తాళాలు వేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఫీజు రీయయింబర్స్‌మెంట్ బకాయిల నిలిపివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన అసోసియేషన్.. 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయనుంది. 20 రోజుల క్రితమే కాలేజీల బంద్‌పై సీఎస్‌కు నోటీస్ ఇచ్చామని, కనీసం 21లోగా రూ. 1800 కోట్ల బకాయిలు చెల్లించాలని పేర్కొంది. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని, అక్టోబర్ 31వ తేదీ నాటికి రెండో విడత బకాయిలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేసింది. ఇక డిసెంబర్ 31వ తేదీ నాటికి మొత్తం బకాయిలు చెల్లించాల్సిందేనని తమ డిమాండ్‌లో పేర్కొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రతీ ఏడాది మార్చి 30లోగా చెల్లించేలా జీవో ఇవ్వాలని అసోసియేషన్ పేర్కొంది.