కాస్త ఆలస్యం నైరుతి రాక.. జూన్‌ 4న దేశంలోకి! ఐఎండీ వెల్లడి

Southwest Monsoon is a bit late this time - Sakshi

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్త ఆలస్యం కానున్నాయి. అవి జూన్‌ 4న దేశంలోకి ప్రవేశించవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు తొలుత కేరళలో ప్రవేశిస్తాయి.

ఈ ఏడాది రుతుపవనాలు కొంత ఆలస్యమైనప్పటికీ దేశవ్యాప్తంగా పంటల సాగుపై, మొత్తం వర్షపాతంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఐఎండీ చీఫ్‌ ఎం.మొహాపాత్రా స్పష్టం చేశారు. రుతుపవనాలు ప్రవేశించే తేదీకి, ఈ సీజన్‌లో నమోదయ్యే మొత్తం వర్షపాతానికి సంబంధం లేదని తెలిపారు. 

సాధారణ వర్షపాతమే! 
నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఏటా జూన్‌ 1న కేరళలో అడుగు పెడతాయి. 2018లో మే 29న, 2019లో జూన్‌ 8న, 2020లో జూన్‌ 1న, 2021లో జూన్‌ 3న, 2022లో మే 29న ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాల రాకపై తమ అంచనాలు 2015 మినహా గత 18 ఏళ్లలో ఎప్పుడూ తప్పలేదని ఐఎండీ పేర్కొంది. మోకా తుఫాను కారణంగానే ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమవుతున్నట్లు చెప్పలేమని కేంద్ర ఎర్త్‌ సైన్సెస్‌ శాఖ మాజీ కార్యదర్శి ఎం.రాజీవన్‌ అన్నారు.

ఈ ఏడాది నైరుతి రతుపవనాల సీజన్‌లో దేశంలో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని తాము అంచనా వేస్తున్నట్లు ఐఎండీ గత నెలలో తెలియజేసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుందని ప్రైవేట్‌ వాతావరణ సంస్థ స్కైమెట్‌ అంచనా వేసింది.

దేశంలో గత నాలుగేళ్లు సాధారణం, సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఆహారంలో 40 శాతం ఆహారం వర్షాధార సాగుతోనే ఉత్పత్తి అవుతోంది. ఆహార భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి తగిన వర్షపాతం నమోదు కావడం చాలా కీలకం. మన దేశంలో 52 శాతం సాగుభూమి వర్షాలపైనే ఆధారపడి ఉంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top