Lockdown: కలెక్టర్‌ ఘటన మరవక ముందే.. అదనపు కలెక్టర్‌

Shajapur Additional Collector Slapping Man Over Violation Corona Lockdown Restrictions - Sakshi

భోపాల్‌: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పెరగడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ ఆంక్షలను పోలీసులు, అధికారులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల అధికారులు లాక్‌డౌన్ ఉల్లంఘించిన ప్రజలపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ సూరజ్‌పూర్‌లో లాక్‌డౌన్ ఉల్లంఘించిన ఓ వ్యక్తిపై కలెక్టర్‌ చేయి చేసుకున్న ఘటన మరవక ముందే అదే తరహాలో మరో ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి చెప్పుల షాప్‌ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై షాజాపూర్ అదనపు కలెక్టర్‌ మంజూషా విక్రంత్‌రాయ్ చేయి చేసుకున్నారు.

ఆమె లాక్‌డౌన్ పరిస్థితిని సమీక్షించేందుకు రోడ్డుపైకి వచ్చిన సమయంలో.. చెప్పుల షాపు తెరచి ఉంచిన యజమాని చెంప పగలగొట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదనపు కలెక్టర్ వ్యవహారంపై తమకు సమాచారం అందిందని రాష్ట్ర మంత్రి ఇందర్‌సింగ్ పర్మార్ పేర్కొన్నారు. అదనపు కలెక్టర్  తీరు సరిగా లేదని, అవసరమైతే ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

ఇక ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌ జిల్లా కలెక్టర్ రణ్‌బీర్‌ శర్మ.. లాక్‌డౌన్‌ పరిస్థితులను సమీక్షించేందుకు రోడ్డుపైకి వచ్చిన సమయంలో.. రోడ్డుపై కనిపించిన ఓ వ్యక్తి చెంపపై కొట్టారు. ఆ యువకుడి మొబైల్‌ ఫోన్‌ సైతం నేలకేసి కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక అత్యుత్సాహం ప్రదర్శించిన రణ్‌బీర్‌ శర్మపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఘటనతో సూరజ్‌పూర్‌ కలెక్టర్ బాధ్యతల నుంచి ప్రభుత్వం ఆయన్ను తప్పించింది. ఆయన స్థానంలో మరొకరిని నూతన కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించిన సంగతి విదితమే.
చదవండి: కలెక్టర్‌ చెంప దెబ్బ: ఐఏఎస్‌ల సంఘం సీరియస్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top