కోవిడ్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ వచ్చేసింది

Roche Antibody Cocktail Launched In India - Sakshi

ఇండియాలో అమ్మకానికి గ్రీన్‌సిగ్నల్‌

ఇప్పటికే యూఎస్‌, యూరప్‌లలో వినియోగం

న్యూఢిల్లీ : కోవిడ్‌ బారిన పడిన వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధి ముదరకుండా చేసే యాంటీబాటీ కాక్‌టెయిల్‌ ఔషధాలు త్వరలో ఇండియాలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అమెరికా, యూరోపియన్‌  యూనియన్‌ దేశాల్లో ఈ ఔషధాన్ని ఉపయోగిస్తుండగా తాజాగా ఇండియాలోను అనుమతులు వచ్చాయి. ఇటీవల ఈ యాంటిబాడీ కాక్‌టెయిల్‌కి సెంట్రల్‌ డ్రగ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ అనుమతి ఇచ్చింది. ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఒక డోసులో 600 మిల్లీ గ్రాముల కాసిరివిమాబ్‌, 600 మిల్లీ గ్రాముల ఇమ్‌డెవిమాబ్‌ మెడిసన్స్‌ ఉంటాయి.

12 ఏళ్లుపై బడిన వారికే
యాంటిబాటీ కాక్‌టెయిల్‌ కిట్‌ మందులు 12 ఏళ్ల పైబడి 40 కిలోల  మించి బరువు ఉన్నవారు మాత్రమే వాడాలి. అదే విధంగా మందులు ఉపయోగించే సమయానికి రోగిలలో ఆక్సిజన్‌ లెవల్స్‌ 90 శాతానికి పైగా ఉండాలని యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌ను అందిస్తోన్న రోచే ఫార్మసీ సంస్థ సూచిస్తోంది. ఈ కిట్‌ ఉపయోగించిన వారిలో 70 శాతంత మంది నాలుగు రోజుల్లో కోలుకున్నారని ఆ సంస్థ చెబుతోంది.  రోచే సంస్థ రూపొందించిన ఈ ఔషధాలను సిప్లా సంస్థ ఇండియాలో పంపిణీ చేస్తోంది.  

ఒక డోసు ఖరీదు రూ. 59,750
యాంటీబాడీ కాక్‌టైల్‌ ఇండియాలో సానుకూల ఫలితాలు ఇస్తుందనే నమ్మకం ఉందంటోంది రోచే ఫార్మసీ సంస్థ. రోగిలో వ్యాధి ముదరకుండా తమ ఔషధం అడ్డుకుంటుందన్నారు. అంతేకాదు ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే రోగు కోలుకునే అవకాశం మెరుగవుతుందన్నారు. కోవిడ్‌ చికిత్సలో భాగంగా ఒక్కో పేషెంట్‌ ఒక డోసు మందులు వాడాల్సి ఉంటుంది. ఒక్కో డోస్‌ ఖరీదును రూ 59,750 రూపాయలుగా నిర్ణయించారు. ఇద్దరు రోగులకు సరిపడా ఔషధాలు ఉన్న కిట్‌ని రూ.1,19,500లకి అందిస్తున్నారు.
 

హైరిస్క్‌ తప్పిస్తుంది
కరోనా సెకండ్‌ వేవ్‌లో స్వల్ప, మధ్య స్థాయి లక్షణాలతో బాధపడుతున్న రోగుల్లో ఉన్నట్టుండి పరిస్థితి విషమిస్తోంది. అప్పటికప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లడం, చికిత్స అందివ్వడం కష్టంగా మారింది. స్వల్ప మధ్యస్థాయి లక్షణాలు ఉన్నప్పుడే ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధాలను ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. దీంతో హై రిస్క్‌ నుంచి బయటపడే వీలుందని వైద్య నిపుణులు అంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top