తిరువనంతపురం: కేరళం సీఎంగా వీడీ సతీషన్ నియామకమయ్యారు. ముఖ్యమంత్రిగా ఆయన పేరును అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది.
సతీషన్ నేపథ్యం
ఆయన పూర్తిపేరు వడక్కేయిల్ దామోదరన్ సతీషన్, నెట్టూరు, ఎర్నాకులం జిల్లాలో మే 31, 1964న ఆయన జన్మించారు. పనంపిల్లి నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యాబ్యాసం పూర్తి చేశారు. వృత్తిరీత్యా న్యాయవాదైన సతీషన్.. NSUI ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎమ్మెల్యేగా 2001లో మొదటిసారిగా పారావూర్ నియోజకవర్గం నుంచి కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుండి వరుసగా ఐదుసార్లు (2001, 2006, 2011, 2016, 2021) అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
అనంతరం 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, రమేష్ చెన్నితాల స్థానంలో ఆయనను కేరళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అప్పటి నుంచి రాష్ట్ర సమస్యలపై గత ప్రభుత్వాన్ని పలుసార్లు ఎండగడుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
కాగా కేరళం ముఖ్యమంత్రి సీటుపై తొలి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వీడీ సతీషన్, రమేశ్ చెన్నితల, కేసీ వేణుగోపాల్‌ల మధ్య ముఖ్యమంత్రి పదవికై తీవ్ర పోటీ నడిచింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ సన్నిహితులైన కేసీ వేణుగోపాల్‌కు ముఖ్యమంత్రి పదవి దాదాపు ఖరారైనేట్లేనని అంతా భావించారు. కాగా ఆశ్చర్యంగా ఆయనే పోటీ నుంచి తప్పుకోవడంతో వీడీ సతీషన్ పేరు అధిష్ఠానం ఖరారు చేసింది.


