
ఉదయపూర్: భార్యను పలు రకాలుగా వేధిస్తూ, ఆమెపై కర్కశంగా యాసిడ్ దాడి చేసిన భర్తకు కోర్టు మరణశిక్ష విధించింది. భార్య శరీరపు రంగును తూలనాడుతూ, ఆమె స్థూలకాయాన్ని హేళన చేస్తూ, హీనంగా ప్రవర్తించిన భర్త కోర్టు తీర్పు మేరకు ఉరికంబం ఎక్కనున్నాడు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన లక్ష్మి అనే మహిళను రంగు తక్కువ ఉన్నావంటూ, ఆమె భర్త కిషన్ తరచు ఎగతాళి చేసేవాడు. ఒక రోజు రాత్రి కిషన్ ఏదో ద్రావకం(యాసిడ్) తెచ్చి.. భార్యతో శరీరమంతా పూసుకోవాలని చెప్పాడు. ఆమె దానిని రాసుకుంది. అయితే ఏదో దుర్వాసన వస్తున్నదని భర్తకు చెప్పింది. తరువాత భర్త ఆమె కడుపుపై అగరుబత్తిని వెలిగించాడు. దీంతో ఆమె శరీరం అంతటా మంటలు వ్యాపించాయి. తరువాత మరికొంత యాసిడ్‌ను ఆమె శరీరంపై పోశాడు. దీంతో ఆమె మంటల్లో కాలి బూడిదయ్యింది.
ఈ ఘటనకు సంబంధించి ఉదయ్‌పూర్‌లోని వల్లభ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. నిందితుడు కిషన్‌ను అరెస్టు చేసిన పోలీసులు అదనపు జిల్లా జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దినేష్ పలివాల్ మాట్లాడుతూ ‘నిందితుడు తన భార్య నల్లగా ఉన్న కారణంగా, ఆమెను వేధించేవాడని, ఈ క్రమంలోనే ఆమెపై యాసిడ్ పోసి నిప్పంటించాడని అన్నారు. తీవ్ర గాయాలతో ఆమె మరణించిందన్నారు. ఈ ఘటనలో నిందితునికి కోర్టు న్యాయమూర్తి మరణశిక్ష విధించారు.