రాధికా యాదవ్‌ హత్యకు కారణం అదేనా? | Sensational Twist Revealed In Radhika Yadav Case, Check Out Full Details And News Video Inside | Sakshi
Sakshi News home page

రాధికా యాదవ్‌ హత్యకు కారణం అదేనా?

Jul 12 2025 8:39 AM | Updated on Jul 12 2025 9:49 AM

Radhika Yadav Case Another Twist Full Details

గురుగ్రామ్‌: హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన మాజీ టెన్నిస్‌ ప్లేయర్‌ రాధికా యాదవ్‌ (25)ను తండ్రి దీపక్‌ యాదవ్‌ (49) హత్య చేసిన కేసు మిస్టరీగా మారింది. రాధిక హత్య కేసులో తాజాగా మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాధిక హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. తమ వర్గానికి చెందని వ్యక్తిని రాధిక ప్రేమిస్తోందని.. అది తన తండ్రికి ఇష్టం లేకపోవడంతోనే హత్య చేసినట్టు దీపక్‌ యాదవ్‌ సన్నిహితులు, ఇరుగు పొరుగు వారు చెప్పుకొచ్చారు. ఇక, ఆమె ప్రియుడు.. రాధిక క్లాస్‌మేట్‌ అని తెలుస్తోంది.

అయితే, ఇప్పటికే రాధిక హత్యకు సంబంధించి వివిధ రకాలుగా వార్తలు బయటకు వచ్చాయి. రాధిక సంపాదనపై ఆధారపడి బతుకుతున్నారంటూ కుమార్తె అవహేళన చేయడంతోనే తండ్రి ఈ హత్యకు పాల్పడ్డారని మొదట వార్తలు వచ్చాయి. అనంతరం, రీల్స్‌ చేయడం కారణంగా హత్య చేసి ఉంటారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ కుటుంబంతో పరిచయం ఉన్నవారు మాత్రం ఆ కథనాల్లో వాస్తవం లేదని చెబుతున్నారు. రాధిక హత్యకు ఆమె ప్రేమ వ్యవహారమే ముఖ్య కారణమని అంటున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే తండ్రి, కూతురు మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు తెలిపారు. 

ఇదిలా ఉండగా, రాధిక హత్య కేసులో దీపక్‌ యాదవ్‌ను శుక్రవారం కోర్టులో హాజరుపరచగా, ఒకరోజు పోలీసు కస్టడీకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, తుపాకీ కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న రాధిక తల్లి ఏం చేస్తున్నారన్నది కూడా విచారిస్తున్నట్లు గురుగ్రామ్‌ పోలీసు అధికారి సందీప్‌సింగ్‌ తెలిపారు. రాధికా యాదవ్‌ గురుగ్రామ్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటోంది. గురువారం ఆమె ఇంట్లో వంట చేస్తుండగా.. తండ్రి దీపక్‌ యాదవ్‌ వెనుక నుంచి తుపాకీతో కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయింది. దీపక్‌ యాదవ్‌కు గురుగ్రామ్‌లో చాలా ఆస్తులు ఉన్నాయి. అద్దెలు కూడా వస్తాయి. ఈ కారణంగానే టెన్నిస్‌ అకాడమీ నడపాల్సిన అవసరం ఏముందని ఆయన కుమార్తెతో తరచూ వాదన పడుతుండేవారని తెలిసింది. 

అలాగే, రాధిక గతేడాది ఓ కళాకారుడితో కలిసి మ్యూజిక్‌ రీల్స్‌ చేసింది. ఈ ఉదంతం వారి కుటుంబంలో చిచ్చు రేపినట్లుగా తెలుస్తోంది. ఓ పాటలో రాధిక నటించింది. ఈ వీడియోతో రాధికతో పాటు ఇనాముల్ అనే వ్యక్తి నటించాడు. ఇక, ఈ పాటలో వారిద్దరూ ఎంతో సన్నిహితంగా కూడా ఉన్నారు. అయితే, ఈ పాటకు వీడియో అయిపోయిన తర్వాత ఆమెతో తాను ఎలాంటి కాంటాక్ట్‌లో తాను లేనని ఇనాముల్‌ చెప్పుకొచ్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement