ఘోరం... ఇది దారుణం! | Shocking incident in Gurugram Haryana | Sakshi
Sakshi News home page

ఘోరం... ఇది దారుణం!

Jul 12 2025 4:18 AM | Updated on Jul 12 2025 4:18 AM

Shocking incident in Gurugram Haryana

‘గర్భ’ గుడిలో జీవం పోసుకోవటంతో మొదలై కడదాకా అడుగడుగునా వివక్ష ఎదుర్కొంటున్న ఆడపిల్లకు మృత్యువు తరచు తారసపడుతుంటుంది. అది పుట్టినిల్లా, మెట్టినిల్లా, నడివీధా, జనసమ్మర్ధం లేని ప్రాంతమా అనే తారతమ్యం లేదు. హంతకులు ఏ రూపంలో వుంటారో, ఎక్కడ కాపుగాస్తారో తెలియదు. తండ్రా, సోదరుడా, కట్టుకున్నవాడా, అపరిచితుడా అనే తేడా కూడా లేదు. ఉసురు తీసేవాడు ఎవడైనా కావొచ్చు. కారణం ఏదైనా ఉండొచ్చు. హరియాణాలోని గురుగ్రామ్‌లో కన్నతండ్రే కాలయముడై నిష్కారణంగా తన కంటిపాపను చిదిమేసిన ఈ ఉదంతం దిగ్భ్రాంతికరమైనది. 

తండ్రి దీపక్‌ యాదవ్‌ తుపాకి గుళ్లకు బలైపోయిన టెన్నిస్‌ క్రీడాకారిణి రాధికా యాదవ్‌ చేసిన ‘నేరం’ ఏమీ లేదు. చిన్న వయసులోనే ఆ క్రీడలో రాణించి, ప్రతిభా పాటవాలు సొంతం చేసుకుని, అంచెలంచెలుగా ఎదగటమే ఆమె నేరం. కేవలం ఇరవై అయిదేళ్లకే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ సర్క్యూట్‌లో ఆమె ర్యాంకు 113. ఆ విధంగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా కూడా నిరూపించుకుంది. సొంతంగా టెన్నిస్‌ అకాడెమీ నెలకొల్పింది. తన వంటి బాలికలకు శిక్షణనిస్తున్నది. వారు ఎదగటానికి ఆసరాగా నిలు స్తున్నది. 

అటువంటి రాధిక, కన్నతండ్రికి కంట్లో నలుసుగా మారిందంటే నమ్మగలమా? ఆమెను కాల్చిచంపటం తప్ప మరో దారిలేదని విశ్వసించాడంటే ఊహించగలమా? యువతరంలో చాలా మందికి ఆ వయసుకల్లా ఏం ఎంచుకోవాలో, ఎటుపోవాలో తెలియని అయోమయం ఆవరిస్తుంది. సంకోచం వెనక్కు లాగుతుంది. కింకర్తవ్య విమూఢత కాటేస్తుంది. ఆశించిన ఉద్యోగం అందక, ఇష్టంలేని కొలువుతో సరిపడక నిస్పృహలో కూరుకుపోతారు. 

కానీ రాధిక అలా కాదు. టెన్నిస్‌ రంగంలో ఎదిగి ఒక సానియా మీర్జాలా, ఒక సెరెనా విలియమ్స్‌లా మెరిసిపోవాలనుకుంది. ఇప్ప టికే రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి ఎన్నో అవార్డులూ, రివార్డులూ సాధించింది. జాతీయ స్థాయి టెన్ని స్‌లో సైతం స్థానం సంపాదించుకోవాలని తపన పడుతోంది. కన్నవారికే కాదు... దేశానికే పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలదన్న భరోసానిచ్చింది. ఇవన్నీ ఆమె తండ్రి దృష్టిలో నేరాలయ్యాయి. 

రాధికా యాదవ్‌ ఉదంతం మనందరం నమ్ముతున్న విలువల్ని ప్రశ్నార్థకం చేస్తోంది. చిన్ననాటి నుంచీ టెన్నిస్‌లో ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించినవాడే హఠాత్తుగా ఎలా హంతకుడయ్యాడు? మెచ్చిన నోటితోనే దుర్భాషలాడే స్థితికి అతగాడు చేరటం వెనకున్న పరిణామాలెలాంటివి? పోలీ సులకిచ్చిన వాంగ్మూలంలో అతను ప్రస్తావించిన అంశాలు వింటే ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న మన సమాజం నిజస్వరూపం బట్టబయలవుతుంది. అంతా సవ్యంగా వుందని ఆత్మవంచనతో బతికేవారిని నిలదీస్తుంది. 

అందరూ దీపక్‌లాగే స్పందించక పోవచ్చుగానీ ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రుల్లో చాలామందికి కన్నకూతురు గురించి నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడటం, ఆమెను చిన్నచూపు చూడటం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం కనబడుతూనే వుంటుంది. ఇలాంటి దుర్మార్గ ధోరణులను ప్రతిఘటించాల్సిన దీపక్‌ యాదవ్‌ తానూ ఆ తానులో ముక్కయ్యాడు. వారు ప్రవచిస్తున్న విలువల పరిధిలో, పరిమితిలో వుండకుండా కుటుంబాన్ని రాధిక వీధిన పడేస్తున్నదని అపోహపడ్డాడు. 

టెన్నిస్‌ క్రీడ గురించీ, తానిస్తున్న శిక్షణలో పాటించే ప్రమాణాల గురించీ ఆమె చేసిన వీడియోపై వచ్చిన కామెంట్లు తట్టుకోలేక సోషల్‌ మీడియా ఖాతాను అప్పటికే తీయించేశాడు. అకాడెమీని సైతం మూసేయాలన్న సలహా కూడా పాటించాలని కోరుకున్నాడు. దాన్ని తిర స్కరించిందన్న ఉన్మాదంతో మానవత్వాన్ని మరిచాడు. కూతురి సంపాదనపై బతుకుతున్నావని ఛీత్కరించిన మృగాల్లో కనీసం ఒక్కరికి తన లైసెన్స్‌ రివాల్వర్‌ను గురిపెట్టివుంటే ఆ బాపతు నోళ్లు మూతబడేవి. స్వయంశక్తితో ఎదుగుతున్న కన్నకూతురి కోసం దృఢంగా నిలబడిన ఒక మంచి నాన్నగా నిలిచేవాడు. ఏమైంది ఇవాళ? యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి హంతకుడిగా మిగిలాడు! 

ఆడపిల్లను పెంచటం, ఆమె అభీష్టానికి అనుగుణంగా ఎదగనివ్వటం, ఇష్టపడిన చదువు చది వించటం, కోరుకున్న వాడికిచ్చి పెళ్లిచేయటం వర్తమానంలో పెను సవాలుగా మారిందన్నది వాస్తవం. తల్లిదండ్రులు విద్యావంతులైనా, ఉన్నతోద్యోగాలు చేస్తున్నా, సమాజం పెట్టిన ప్రమాణా లను ఆడపిల్ల మీరితే ఎలా అన్న విచికిత్సలో పడుతున్నవారు చాలామందే తారసపడతారు. వారిలో అనేకులు చుట్టూవున్నవారి ఒత్తిళ్లకు లొంగి ఇంటి ఆడపిల్లను అదుపు చేయటానికి ప్రయ త్నించేవారే. 

ఆ క్రమంలో అనేకమంది పిల్లలు తమ ఇష్టాలను వదులుకుని బతుకులు వెళ్లదీస్తు న్నారు. అసలు బయటికెళ్లిన ఆడపిల్ల సురక్షితంగా ఇంటికొస్తుందో లేదో తెలియని ఆందోళనతో నిత్యం భయంభయంగా బతుకుతున్న తల్లిదండ్రులకు మేమున్నామంటూ భరోసానిచ్చే వ్యవస్థలు న్నాయా? సామాజిక కట్టుబాట్ల పేరుతో రూపొందుతున్న తప్పుడు విలువలు ఇళ్లల్లోకి చొరబడకుండా, వాటి దుష్ప్రభావాలు కుటుంబాలపై పడకుండా నివారించే సంస్కృతి ఆచూకీ ఏది? మన ప్రభుత్వాలు తీసుకుంటున్న కనీస చర్యలేమిటి?

ఆడవాళ్లను కించపరిచే సినిమాలనూ, ఇతరేతర మాధ్యమాలనూ ఏ మేరకు కట్టడి చేయగలుగుతున్నాం? ఎటువంటి వివక్షకూ తావు లేకుండా దేశ పౌరులందరికీ సమాన అవకాశాలు లభించాలన్న మన రాజ్యాంగం సక్రమంగా అమలవు తున్నదా? ఇవన్నీ సరిగా లేనప్పుడు దీపక్‌లాంటివారు రూపొందుతారు. వారికి నారూ నీరూ పోస్తున్నవారు ఎప్పటికీ పదిలంగా వుంటారు. రాధికా యాదవ్‌ వంటి మణిపూసలు నిస్సహాయంగా నేల రాలుతారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement