దేశభద్రతలో ఆత్మనిర్భరత  | Prime Minister Narendra Modi at Armed forces conference in Kolkata | Sakshi
Sakshi News home page

దేశభద్రతలో ఆత్మనిర్భరత 

Sep 16 2025 6:27 AM | Updated on Sep 16 2025 6:27 AM

Prime Minister Narendra Modi at Armed forces conference in Kolkata

సైనిక దళాల్లో సంస్కరణలు వేగవంతం చేయాలి 

త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం రావాలి 

కంబైన్డ్‌ కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌లో మోదీ 

కోల్‌కతా: దేశ భద్రత విషయంలో మరింత స్వయం సమృద్ధి సాధించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకోసం సైనిక దళాల్లో సంస్కరణలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. సైన్యం, నేవీ, వైమానిక దళాల మధ్య సమన్వయం, సహకారం మరింత పెరగాలని సూచించారు. కోల్‌కతాలో సోమవారం ఆయన 16వ కంబైన్డ్‌ కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌ (సీసీసీ)ను ప్రారంభించారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అనిల్‌ చౌహాన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

భవిష్యత్తు కోసం మార్పు: సీసీసీలో సైనిక దళాల్లో గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన సంస్కరణలను ప్రధాని సమీక్షించారు. వచ్చే రెండు సంవత్సరాల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌ సిందూర్‌లో సైనిక దళాలు చూపిన తెగువను ప్రధాని ప్రశంసించారు. ‘సంస్కరణల సంవత్సరం– భవిష్యత్తు కోసం మార్పు’ అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో సైనిక, ఆయుధ పరంగా స్వయంసమృద్ధి సాధించాల్సిన ఆవశ్యకతను ప్రధాని నొక్కిచెప్పారు. భారత త్రివిధ దళాలు జాతి నిర్మాణంతోపాటు కల్లోల ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ప్రకృతి విపత్తుల సమయంలో దళాల సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను సమర్ధంగా ఎదుర్కోవాలంటే దళాల్లో సంస్కరణలను వేగవంతం చేయాలని, సైనిక పరంగా స్వయంసమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement