మాతృప్రేమను పంచకుండానే ప్రాణం పోయింది | Pregnant Woman Life Ends Due To Doctors Negligence | Sakshi
Sakshi News home page

మాతృప్రేమను పంచకుండానే ప్రాణం పోయింది

Jun 15 2025 11:43 AM | Updated on Jun 15 2025 11:43 AM

Pregnant Woman Life Ends Due To Doctors Negligence

సిజేరియన్‌ చేసిన  రెండో రోజే బాలింత మృతి 

వైద్యుల నిర్లక్ష్యమంటూ బంధువుల  ఆందోళన 

దొడ్డబళ్లాపురం: పండంటి బిడ్డను పొత్తిళ్లలో ఉంచుకొని మాతృప్రేమను పంచుతుండగానే బాలింత ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సిజేరియన్‌ చేసిన రెండో రోజే బాలింత మృతిచెందగా ఇందుకు వైద్యుల నిర్లక్ష్యం కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దుర్గమ్మ(21) అనే గర్భిణి కాన్పు కోసం విజయనగర జిల్లా హరపనహళ్లిలోని తన పుట్టింటికి వచ్చింది. మూడు రోజుల క్రితం నొప్పులు రావడంతో తల్లితండ్రులు సమీపంలోని హరపనహళ్లి తాలూకా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సిజేరియన్‌ చేసి డెలివరీ చేశారు. 

అయితే డెలివరీ తరువాత ఆరోగ్యం క్షీణించడంతో దుర్గమ్మను చిగటేరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ 12 బాటిళ్ల రక్తం ఎక్కిచి గర్భసంచి తొలగించారు. అయినా దుర్గమ్మ మృతి చెందింది. హరపనహళ్లి ఆస్పత్రిలో వైద్యులు కుట్లు సరిగా వేయకపోవడం వల్లే తమ కుమార్తె మృతిచెందినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న జై భీమ్‌ ఆర్మీ కార్యకర్తలు ఆస్పత్రి ముందు ధర్నా చేశారు. దుర్గమ్మ మృతికి కారణమైన వైద్యులపై కేసు నమోదు చేయాలని, మృతురాలి కుటుంబానికి తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

తీవ్ర రక్తస్రావం జరిగింది 
చిగటేరి జిల్లా ఆస్పత్రి మెడికల్‌ సూపరిండెంట్‌ మాట్లాడుతూ సిజేరియన్‌ తరువాత దుర్గమ్మకు తీవ్ర రక్తస్రావం జరిగిందన్నారు.  ఆస్పత్రికి వచ్చేటప్పటికే ఆబీపీ డౌన్‌ అయ్యిందన్నారు. రక్తస్రావాన్ని ఆపడానికి గర్భసంచి తొలగించామన్నారు. 15 యూనిట్ల బ్లడ్‌ ప్లేట్‌ లెట్లు ఇచ్చినా ఫలితం లేకుండాపోయిందన్నారు. పోస్టుమార్టం తరువాత ఏం జరిగిందనేది తెలుస్తుందన్నారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement