PM Modi Slams Congress At Bhopal New Delhi Vande Bharat Train Launch - Sakshi
Sakshi News home page

వందే భారత్‌ రైలు ప్రారంభోత్సవం.. కాంగ్రెస్‌పై మోదీ ‘ఏప్రిల్ ఫూల్’ కామెంట్స్..

Published Sat, Apr 1 2023 7:52 PM

PM Modi Slams Congress At Bhopal New Delhi Vande Bharat Train Launch - Sakshi

న్యూఢిల్లీ: భోపాల్-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లోని రాణి కమలాపతి స్టేషన్‌లో జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగు భాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫ్లాగ్  పాల్గొన్నారు..కాగా భారత్‌లో ఇది 11వ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కాగా మధ్యప్రదేశ్‌లో తొలి రైలు.  ఇది 708 కిలోమీటర్ల దూరాన్ని 7.45 గంటల్లో చేరుకోనుంది. 

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ‘నేడు మోదీ అందరినీ ఏప్రిల్‌​ ఫూల్స్‌ చేస్తారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. కానీ అదే ఏప్రిల్‌ 1వ తేదీన వందే భారత్‌ రైలును ప్రారంభించాం. ఇది మన నైపుణ్యం, సామర్థ్యం, విశ్వాసానికి చిహ్నం’ అని తెలిపారు. గత ప్రభుత్వాలు కేవలం ఒక కుటుంబాన్ని మాత్రమే దేశపు ప్రథమ కుటుంబంగా భావించేవారని పరోక్షంగా గాంధీ కుటుంబంపై ధ్వజమెత్తారు. దేశంలోని మధ్యతరగతి కుటుంబాలను ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు.
చదవండి: పది నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ

భారతీయ రైలు సామాన్యులకు, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటాయన్నారు. రైలు ప్రయాణం ఇప్పుడు సురక్షితంగా మారిందని చెప్పారు. వందే భారత్ దేశంలో సరికొత్త పరిణామానికి, అభివృద్ధికి ప్రతీక అని అన్నారు. దేశంలోని అన్ని వైపుల నుంచి ఈ రైళ్లకు డిమాండ్ ఉందని, వందే భారత్‌ సూపర్‌హిట్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కొత్త వందే భారత్ రైళ్లు నూతన ఉద్యోగావకాశాలను, అభివృద్ధిని తీసుకొస్తాయని తెలిపారు.

గత 9 ఏళ్లలో భారతీయ రైల్వేను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మోదీ తెలిపారు.  దేశంలోని 900 రైల్వే స్టేషన్లలో సీసీటీవీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  రైళ్లు పరిశుభ్రంగా ఉంటున్నాయని, సకాలంలో నడుస్తున్నాయని తెలిపారు. గతంలో మధ్య ప్రదేశ్‌ రైల్వేలకు కేవలం రూ.600 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారని, ఇప్పుడు రూ.13,000 కోట్లు కేటాయించామని చెప్పారు. మధ్య ప్రదేశ్ పాత రోజులను వెనుకకు నెట్టి, నూతన అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement