సోమనాథుని చెంతకు ప్రధాని: వెల్లువలా భక్తజనం | PM Modi Leads Grand Somnath Amrit Mahotsav Celebrations | Sakshi
Sakshi News home page

సోమనాథుని చెంతకు ప్రధాని: వెల్లువలా భక్తజనం

May 11 2026 11:51 AM | Updated on May 11 2026 12:41 PM

PM Modi Leads Grand Somnath Amrit Mahotsav Celebrations

గిర్‌ సోమనాథ్‌: భారతదేశ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం నేడు సరికొత్త చరిత్రకు వేదికైంది. ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘సోమనాథ్ అమృత్ మహోత్సవం’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొన్నారు. భక్తిప్రపత్తులు, వేద మంత్రోచ్ఛారణల మధ్య జరుగుతున్న ఈ ఉత్సవం భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది.

 



75 ఏళ్ల ఘన చరిత్ర.. అరుదైన కుంభాభిషేకం
సరిగ్గా 75 ఏళ్ల క్రితం మే 11వ తేదీన సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా దేశంలోని 11 పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో ‘కుంభాభిషేకం’ నిర్వహించడం విశేషం. ఆలయ చరిత్రలో ఇలాంటి అరుదైన ఘట్టం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ప్రధానమంత్రి ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఆలయ శిఖరానికి జలాభిషేకం చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో సోమనాథ తీరం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది.

 

రోడ్‌ షోలో జననీరాజనం.. ప్రత్యేక నాణెం విడుదల
ప్రధానమంత్రి రాకను పురస్కరించుకుని సోమనాథ్ పరిసర ప్రాంతాలు పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. కార్యక్రమానికి ముందు మోదీ భారీ రోడ్‌ షో నిర్వహించగా, జనం పెద్ద ఎత్తున తరలివచ్చి  స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో సంప్రదాయ పద్ధతిలో ధ్వజారోహణ నిర్వహించిన ప్రధాని, సోమనాథ్ చారిత్రక వారసత్వాన్ని గుర్తుచేస్తూ ప్రత్యేక తపాలా బిళ్ళను, స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భద్రతా పరంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
 

వడోదరలో సర్దార్ ధామ్ హాస్టల్ ప్రారంభం
సోమనాథ్‌లో ఆధ్యాత్మిక వేడుకల అనంతరం ప్రధాని వడోదర పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ విద్యార్థుల కోసం నిర్మించిన ‘సర్దార్ ధామ్’ హాస్టల్‌ను ఆయన ప్రారంభించనున్నారు. వెయ్యి మంది బాలురు, మరో వెయ్యి మంది బాలికలకు అత్యాధునిక వసతులతో కూడిన ఈ హాస్టల్, విద్యా రంగంలో ఒక ముందడుగుగా నిలవనుంది. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని పర్యటన కొనసాగుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement